ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఆమెకు ఇది సాధారణ కాన్పు కావడం విశేషం. శిశువుల్లో ముగ్గురు మగవాళ్లు, ఒకరు అమ్మాయి ఉన్నారు. అయితే దురదష్టవశాత్తు ఆ నలుగురు చిన్నారులు గంటల వ్యవధిలోనే ఆసుపత్రిలో మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన కలీదా బేగం గర్భిణి. ఆదివారం పురుటి నొప్పులు రావడంతో స్థానికంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని, కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని కలీదా కుటుంబ సభ్యులకు సూచించారు. ఇక సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు.
అక్కడ ఆమె సాధారణ కాన్పు ద్వారా నార్మల్ డెలివరీ ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. నలుగురిలో ముగ్గురు అమ్మాయిలు కాగా, ఒకరు అబ్బాయి. శిశువులందరూ తక్కువ బరువుతో జన్మించారు. అయితే నలుగురు చిన్నారులు నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టినట్లు వైద్యులు తెలిపారు. వారికి ప్రత్యేక సంరక్షణ అవసరమని, నియోనాటల్ ఇంటెన్వివ్ కేర్ యూనిట్‌లో తక్షణమే చేర్పించాలని పేర్కొన్నారు. కానీ కుప్వారా జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో లేదు.
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు ఆడ శిశువులు కుప్వారా ఆస్పత్రిలోనే మరణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ, మగ శిశువును శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ బాబు కూడా చనిపోయాడు. ఇలా గంటల వ్యవధిలోనే నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలీదాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కలీదా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా కుప్వారా జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి, నవజాత శిశువుల అత్యవసర సంరక్షణ సౌకర్యాలు లేవు. దీంతో ఎక్కువగా రోగులను శ్రీనగర్‌కు పంపిస్తుంటారు. ఈ క్రమంలో సకాలంలో వైద్యం అందక చాలా దూరం ప్రయాణించడంతో రోగులు మరణించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment