న్యూఢిల్లీ/పుణె: ఇటీవల మహారాష్ట్రలో ఓ దళితుని ఇంటికి వెళ్లినట్లు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. వారికి వంటలో సహకరించానని, కలిసి భోజనం చేశానని చెప్పారు. వారు చెప్పే విషయాలు ఎంతో ఆసక్తి కలిగించాయని తెలిపారు. దళితుని ఇంట్లో గడిపిన వీడియోను సోమవారం రాహుల్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. కొల్హాపూర్‌కు చెందిన అజయ్ తుకారాం సనాడే, అంజనా తుకారాం సనాడే దంపతుల ఆహ్వానం మేరకు రాహుల్ వారింటికి వెళ్లారు.
ఒక మధ్యాహ్నం వారితో గడిపారు. వంటింట్లో వారితో కలిసి పచ్చి బఠాణీల కూర, వంకాయ కందిపప్పు కూర వండటంలో సాయ పడినట్లు చెప్పుకున్నారు. ‘దళితులు ఏం తింటారు? ఎలా వండుకుంటారు? వాళ్ల వంటగది ఎలా ఉంటుంది? అనే విషయాలు ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఈ విషయాలకు సామాజిక, రాజకీయ ప్రాముఖ్యం ఎంతో ఉంది. నాకు ఎంతో ఆసక్తి కలిగించాయి’అని రాహుల్ పేర్కొన్నారు.
దళితులుగా వారు ఎదుర్కొంటున్న కుల వివక్ష తాలూకా అనుభవాలను షాహు పటోలెతోపాటు, అజయ్ తుకారాం, అంజనా తుకారాం దంపతులు తనకు వివరించారన్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో దళితుల వంటలపై షాహు పటోలె మరాఠాలో రాసిన పుస్తకం ఇంగ్లిష్‌లోకి కూడా అనువదించారని రాహుల్ తెలిపారు. ఆ పుస్తకంలోని వంటల గురించి పటోలె తనకు వివరించారన్నారు. అసలు దళితుల ఆహారంలో ఏం ఉంటాయనే విషయం ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదని పటోలె చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment