యాత్రలో అభిమానులతో రాహుల్
త్రిసూర్(కేరళ): విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల ధాటికి ఆగ్రహావేశాలతో ఉన్న ప్రజలను సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ సర్కార్ శతథా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎగసిన ధరల అంశాలను గాలికొదిలేసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ద్వయం సమాజంలో విద్వేషాన్ని పెంచి హింసకు తావు కల్పిస్తున్నాయని రాహుల్ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రను శనివారం ఆయన త్రిసూర్ దగ్గర్లోని పెరంబ్రలో ప్రారంభించారు.
త్రిసూర్‌లో భారీ జనసందోహానుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘గత ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఏం చేసిందని తరచూ ప్రధాని మోదీ అడుగుతుంటారు. అయితే, మోదీ జీ, మేం ఎన్నడూ దేశంలో నిరుద్యోగిత ఇంతటి గరిష్ట స్థాయికి తేలేదు. నిత్యావసరాల ధరలూ ఈ స్థాయికి పెరగలేదు. మా యూపీఏ హయాంలో వంటగ్యాస్ కోసం రూ.400 సరిపోయేవి. ఆ ధరే ఎక్కువ అన్నట్లు ఆనాడు మీరు మాట్లాడారు. కానీ, ఇప్పుడు రూ.1,000 దాటేసింది.
ఇప్పుడు ఒక్క ముక్క కూడా మాట్లాడరేం?’’ అని ప్రశ్నించారు. ‘‘ఇంధన ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యుల సొమ్మును అన్యాయంగా లాక్కుంటున్నారు. కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల బోషాణంలో పోస్తున్నారు. హింస, విద్వేషం పెరిగేలా చేసి ప్రజా సమస్యల నుంచి పౌరుల దృష్టిని కేంద్రం మళ్లిస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘పట్టణ నిరుద్యోగిత రేటు దేశంలో కేరళలోనే అత్యధికం. రాష్ట్ర ప్రభుత్వ పాలనను విమర్శించడం నా ఉద్దేశంకాదు. సీఎం విజయన్‌కు నా విజ్ఞప్తి ఒక్కటే. యువత భవితను పట్టించుకోండి’’ అని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment