న్యూఢిల్లీ: విశ్వ వేదికపై తెలుగు బావుటా ఎగరేసిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డులు సాధించినందుకు పార్లమెంట్ జేజేలు పలికింది. భారతీయ సినిమా ఖ్యాతికి ఈ విజయాలు మరింతగా వన్నెతెచ్చాయంటూ మంగళవారం రాజ్యసభలో చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రస్తుతించారు.
‘‘ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఇద్దరు మహిళల ఉత్కృష్ట పనితనాన్ని ఎలుగెత్తి చాటింది. భారతీయ మహిళలకు అంతర్జాతీయంగా దక్కిన అపురూప గౌరవమిది’’ అని రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఆర్‌ఆర్‌ఆర్ రచయిత వి.విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడేనని గుర్తుచేశారు.
సభలో నవ్వులు పూయించిన ఖర్గే
రెండు దక్షిణాది సినిమాలు ఆస్కార్ దక్కడం గర్వించాల్సిన గొప్ప విషయమని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా బీజేపీనుద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ‘అధికార పార్టీని నేను కోరేదొక్కటే.
ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది, పాట రాసింది మేమేనంటూ మోదీజీ గానీ, బీజేపీ సర్కార్ గానీ ఆస్కార్ ఘనతను తమ ఖాతాలో వేసుకోవద్దు. ఇది దేశం సాధించిన ఘనత’ అన్నారు. దాంతో సభ్యులు బిగ్గరగా నవ్వేశారు. ఆస్కార్ గెలిచిన దేశ ప్రతినిధుల గురించి పార్లమెంట్‌లో చర్చించడం ఆనందంగా ఉందని మాజీ నటి, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment