అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఆరోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు తెలిపారు.
శ్రీరామ నవమినాడు ఆలయంలో జరిగే పూజాదికార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని చంపత్ రాయ్ తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నగరంలో 100 చోట్ల ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేయనుందని అన్నారు. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి తమ సూచనను ప్రసార భారతి ఆమోదించిందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎండబారిన పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. శ్రీరామ నవమికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని భావిస్తున్నామన్నారు.
రామాలయంలో భక్తుల దర్శనం కోసం ఏడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చంపత్ రాయ్ తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు లైన్లు మాత్రమే ఉన్నాయని, మరో మూడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులు తమ వెంట ఆలయంలోనికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. దర్శనం త్వరగా జరిగేలా పలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని ఏప్రిల్ 16, 17, 18వ తేదీల్లో మూడు రోజుల పాటు 24 గంటలూ తెరిచివుంచేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశప్రజలంతా ప్రసార భారతి ద్వారా, ఇంట్లో నుంచే రామ్‌లల్లాను దర్శించుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment