మనిషి జీవితంలో వయసు అనేది కేవలం ఓ నంబర్ మాత్రమే అంటారు చాలా మంది. కలలు సాకారం చేసుకోవాలనుకువారు.. ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే వారు వయసును పెద్దగా పట్టించుకోరు. ఒకప్పుడు కోల్పోయిన అవకాశాలను మళ్లీ అందిపుచ్చుకుంటారు. ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని పట్టించుకోరు. తమ మనసుకు నచ్చిన పని చేస్తూ.. సంతోషంగా ఉంటారు. ఇలాంటి వారికే త్వరగా గుర్తింపు దక్కుతుంది. ఇందుకు ఉదాహరణలు మన చుట్టు కొకొల్లలు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా సోషల్ మీడియా ఓ బామ్మను ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీగా మార్చింది. 60 ఏళ్ల రవి బాల శర్మ అనే ఈ బామ్మ డ్యాన్స్‌కు నెటిజనులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. తన హవభావాలు, డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో అదరగొడుతున్నారు బామ్మ. ప్రస్తుతం ‘‘డ్యాన్సింగ్ దాదీ’’ పేరుతో ఈ బామ్మ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతియాజ్ అలీ, దిల్జిత్ దోసాంజ్ వంటి వారు బామ్మ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ అయ్యారు. ఈమె డ్యాన్స్ వీడియోలు చూసిన వారంతా ‘‘బామ్మ మీ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే’’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా రవి బాలా శర్మ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అవకాశం దొరికితే చాలు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని డ్యాన్స్ చేసేదాన్ని. కానీ దానిలో రాణించే అవకాశం లభించలేదు. ఇలా ఉండగానే వివాహం అయ్యింది. ఆ తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతలతో సరిపోయింది. దాంతో డ్యాన్స్ ప్రాక్టీస్ మూలన పడింది’’ అంటూ చెప్పుకొచ్చారు.
‘‘ఇలా ఉండగానే నా భర్త మరణించారు. ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయాను. డిప్రెషన్‌లోకి వెళ్లాను. నన్ను మాములు మనిషిని చేయడం కోసం నా పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టమని బలవంతం చేశారు. నన్ను గొప్ప డ్యాన్సర్‌గా చూడాలని నా భర్త కోరుకునేవాడు. ఆయన కల నేరవేర్చడం కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాను’’ అంటూ చెప్పుకొచ్చారు.
‘‘ఈ క్రమంలో నా సోదరి ఓ సారి నన్ను ఆడిషన్‌కి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. ఆశ్చర్యం చాలా మంది నన్ను ప్రశంసించారు. బాగా చేశానని మెచ్చుకున్నారు. వారి ప్రశంసలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుండేదాన్ని. ఓ వీడియోకు ఏకంగా ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు’’ అన్నారు.
‘‘నా కల నిజం అవుతుందని కానీ.. ఈ వయసులో ఇంత పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తానని కానీ నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను ప్రోత్సాహిస్తున్నవారందరికి ధన్యవాదాలు. వయసు మీద పడిందని బాధ పడకండి. అది కేవలం ఓ నంబర్ మాత్రమే. కలలను సాకారం చేసుకోవడానికి వయసుతో పని లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు ఈ బామ్మ.
చదవండి: మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి
Comments
Please login to add a commentAdd a comment