సాక్షి, హైదరాబాద్: మీరు వాహనం నడిపేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా? కళ్లు తిరిగినట్లు అనిపిస్తోందా? కారు లేదా లారీ లేదా ఏదైనా వాహనాం నడిపేటప్పుడు ఒక పక్కకు వెళ్లినట్లు అనిపించిందా? మీకు తెలియకుండానే యాక్సిడెంట్ అయిపోయిందా? ఒక్కసారిగా స్టీరింగ్ వదిలేశారా? అయినా ఏం జరిగిందో మీకు అర్థం కాలేదా? ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారంటే.. మీ మెదడులోని బ్యాలెన్స్ సిస్టంలో ఏదో లోపం కారణంగానే ఇలా జరుగుతూ ఉండే అవకాశముంది.
దీన్నే వైద్య పరిభాషలో మోటరిస్ట్ వెస్టిబులర్ డిస్‌ఓరియంటేషన్ సిండ్రోమ్ అంటారు. రోడ్డు ప్రమాదాల్లో 50% వరకు బ్రెయిన్ బ్యాలెన్స్ సిస్టంలో సమస్యల వల్లే జరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రైవింగ్ చేయాలంటే మన కళ్ల నుంచి మెదడు వరకు కోఆర్డినేషన్ వ్యవస్థ ఉంటుందని, అది సక్రమంగా పని చేయకపోతే బ్యాలెన్స్ తప్పుతుందని వైద్యులు అంటున్నారు. ఈ బ్యాలెన్స్ సమస్య వల్ల చాలా తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయి.
అధిక వేగంతో వెళ్తున్నప్పుడు.. మలుపు తిరిగేటప్పుడు
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఇతరత్రా కారణాలతో పాటు సాధారణంగా డ్రైవర్ మద్యం తాగి ఉంటాడనుకుంటాం. డ్రైవింగ్ సరిగా రాదని, తగిన అనుభవం లేదని అనుకుంటాం. కానీ ఇలా యాక్సిడెంట్ చేసిన వారిలో చాలా మందికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండి ఉండొచ్చునని, బ్యాలెన్స్ సిస్టంలో సమస్య ఉందని కానీ ఎవరూ అనుకోరు. డ్రైవర్లు కూడా తమకు కళ్లు తిరిగితే నీరసం అనుకుంటారు. సరిగా నిద్రలేకపోవడం వల్ల ఇలా జరిగిందనుకుంటారు.
వాంతుల ఫీలింగ్ ఉంటే గ్యా్రస్టిక్ సమస్య అనుకుంటారు. చాలామందికి తమలో బ్యాలెన్స్ సమస్య ఉందన్న సంగతే తెలియదు. మానసిక సమస్యలు ఉన్నవారు, డిప్రెషన్, భయం ఉన్న వారిలో ఇలాంటి బ్యాలెన్స్ సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య ఉన్నవారిలో 66% మందికి అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. 58 శాతం మంది మల్టిపుల్ లేన్స్ ఉన్నప్పుడు గందరగోళానికి గురవుతారు. కళ్లు తిరుగుతుంటాయి.
చదవండి : దత్తపుత్రుడికి ఆస్తి హక్కులుండవ్: హైకోర్టు
58% మందికి టర్నింగ్ (మలుపు తిరిగేటప్పుడు) సమయంలో సమస్య ఉత్పన్నమవుతుంది. 40 % మందికి ఇతర వాహనాన్ని చూసినప్పుడు కంగారు, కళ్లు తిరగడం వంటివి సంభవిస్తాయి. 25% మందికి బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నా, పల్లానికి వెళ్తున్నా కళ్లు తిరుగుతాయి. 29% మందికి ఓవర్‌టేక్ చేసేప్పుడు కళ్లు తిరుగుతాయి. 12 శాతం మందిలో ఇరుకైన సొరంగాల్లో వెళ్తున్నప్పుడు ఇటువంటి సమస్య ఏర్పడుతుంది.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పష్టత (క్లారిటీ) ఉండాలి. దాన్నే స్పేషియల్ కాగ్నెటివ్ ఎబిలిటీ అంటారు. మన కాళ్లు, చేతుల మధ్య కోఆర్డినేషన్ అవసరం. ఇందులో మన బ్రెయిన్, కొన్ని నరాలు కూడా భాగస్వామ్యం అవుతాయి. ఆప్టిక్ నర్వ్ చూడటానికి, ఆక్యులో మోటార్ నర్వ్ కళ్లు అటూ ఇటూ తిప్పి చూడడానికి సహకరిస్తాయి. వెస్టిబిలో కాక్లియర్ నర్వ్ మన బ్యాలెన్స్‌ను నియంత్రిస్తుంది. ముందుకు వెళ్లాలన్నా, వెనక్కు వెళ్లాలన్నా ఇది నియంత్రిస్తుంది. స్పైనల్ యాక్సెసరీ నర్వ్ మనం మెడ అటూ ఇటూ తిప్పడాన్ని నియంత్రిస్తుంది.
ఇవన్నీ కాకుండా బ్రెయిన్‌లో ఉన్న మోటార్ సెరిబెల్లార్ సిస్టం, ఎక్‌స్ట్రా పిరమిడల్ సిస్టం కీలకమైన పాత్ర పోషిస్తాయి. మనం డ్రైవ్ చేయాలంటే ఇవన్నీ కూడా కరెక్ట్‌గా పనిచేయాలి. వెస్టిబిలో కాక్లియర్ నర్వ్ మనం నడవాలన్నా, వెనక్కు ముందుకు జరగాలన్నా.. ఇలా మొత్తం బ్యాలెన్స్‌ను నియంత్రిస్తుంది. ఈ నరంలో సమస్య ఏర్పడితే డ్రైవింగ్ చేసేటప్పుడు సమస్యలు వస్తాయి. అలా వచ్చే సమస్యలనే మోటరిస్ట్ వెస్టిబిలో సిండ్రోమ్ అంటారు. ఇది స్కిల్డ్ డ్రైవర్లలో వచ్చే సడన్‌గా వచ్చే సమస్య. ట్రక్ డ్రైవర్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. లారీ, బస్సు డ్రైవర్లలోనూ ఈ సమస్య ఉంటుంది.
79 శాతం మందిలో డిసోరియెంటేషన్ ఏర్పడుతుంది. సడన్‌గా వారు ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో అర్థం కాదు. 55 శాతం మందికి కళ్లు తిరుగుతాయి. వాహనంపైనా నియంత్రణ కోల్పోతారు. 35 శాతం మందికి కారు ఒకవైపు పోతున్నట్లు అనిపిస్తుంది. 25 శాతం మందికి చెమటలు పట్టడం, కాళ్లు చేతులు చల్లగా అయిపోయి గుండె దడదడ కొట్టుకోవడం జరుగుతుంది. 25 శాతం మందికి శరీరం గట్టిగా (స్టిఫ్) అయిపోతుంది. ఇలాంటి సమస్యకు గురైన చాలామంది గుండెపోటు వచి్చందనుకొని భయపడతారు. కానీ ఈసీజీ వంటివి చేస్తే అన్నీ సాధారణంగానే ఉంటాయి.
ఏం చేస్తున్నారో అర్ధం కాదు..
డ్రైవర్లకు ఎలా తోలుతున్నారు అన్నదాన్ని చూసే అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తారు.. కానీ వారి ఆరోగ్య పరిస్థితిని చూడరు. బ్యాలెన్స్ సిస్టంను ఎవరూ చెక్ చేయరు. అయితే మోటరిస్ట్ వెస్టిబులర్ సిండ్రోమ్‌తో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడయ్యింది. మా వద్దకు ఇలాంటి వారు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. బ్యాలెన్స్ సమస్య ఉన్నవారిలో 60 శాతం మందికి మైగ్రేన్ (తలనొప్పి) సమస్య ఉన్నట్లు గుర్తించారు.
50 శాతం మందిలో వాంతి వచ్చినట్లు అవడం జరుగుతుంది. ఈ తరహా వాటన్నింటికీ చికిత్స ఉంది. న్యూరో ఆటాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ పరీక్ష చేసి, పరిస్థితిని అంచనా వేసి చికిత్స చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. కొన్నింటికి మందులు ఉంటాయి. కొన్నింటికి వ్యాయామంతోనే సరిచేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 30–45 వయస్సు వారిలో ఎక్కువగా ఇటువంటి సమస్యలుంటాయి. మహిళల్లోనూ ఎక్కువగా చూస్తుంటాం.
– డాక్టర్ లాస్య సింధు, ఈఎన్‌టీ న్యూరో ఆటాలజిస్ట్, సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment