కరోనా సోకిన వారిలో కొంతమందికి వాసన చూసే శక్తి ఉండదని మనందరికీ తెలుసు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది. కరోనా వైరస్ కారణంగా వాసనలను గుర్తించే శక్తి తాత్కాలికంగా పోతుందని గత పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేసినా.. కోవిడ్–19 కారక వైరస్‌తో జరుగుతున్న నష్టం భిన్నమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణ కరోనా వైరస్‌ల వల్ల నెలలపాటు వాసన చూసే శక్తిని కోల్పోతుంటే.. కరోనాతో బారినపడ్డ వారిలో నాలుగు వారాల్లోనే ఆ శక్తి మళ్లీ వస్తున్నట్లు చెప్పారు.
సాధారణ వైరస్‌ల బారిన పడినప్పుడు వాసనను గుర్తించి మెదడుకు ఆ సమాచారాన్ని చేరవేసే సెన్సరీ న్యూరాన్లు దెబ్బతింటున్నాయని కోవిడ్ –19 విషయంలో న్యూరాన్లు దెబ్బతినడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ..తాజా అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ ఈ న్యూరాన్లకు సహాయకారులుగా ఉండే ఇతర కణాల్లోకి చొరబడుతుండటం వల్లనే రోగులు వాసన చూసే శక్తిని కోల్పోతున్నట్లు స్పష్టమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వాసనను గుర్తించి మెదడుకు ఆ సమాచారాన్ని చేరవేసే న్యూరాన్లు మాత్రం ఈ వైరస్ బారిన పడకపోవడం! కరోనా వైరస్ శరీర కణాల్లోకి చొరబడేందుకు ఆధారంగా చేసుకునే ఏస్ –2 రిసెప్టర్ ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఈ న్యూరాన్లలో లేవు. కానీ.. ఈ న్యూరాన్లకు సహాయకారులుగా ఉండే కణాల్లో మాత్రం ఉంటుంది. అంతేకాకుండా. రక్తనాళ కణాలు, కొంతమేరకు మూలకణాల్లోనూ ఏస్–2 రిసెప్టర్ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువులు ఉంటాయి. దీన్నిబట్టి కోవిడ్–19 రోగుల్లోని ఈ సహాయక కణాలను వైరస్ ఆక్రమించడం వల్లనే వాసన చూసే శక్తి తాత్కాలికంగా లేకుండా పోతోందని తెలుస్తోంది.
వ్యాధి నుంచి కోలుకున్న తరువాత ఈ శక్తి మళ్లీ వారికి అందుతుండటం గమనార్హమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త సందీప్ రాబర్ట్ దత్తా తెలిపారు. కోవిడ్–19 బారిన పడ్డ వారిలో ఘ్రాణశక్తి శాశ్వతంగా కోల్పోయే అవకాశాల్లేవని తమ అధ్యయనం ద్వారా స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు మరికొంత సమాచారం అవసరమని చెప్పారు. మనిషి శ్వాసకోశంలో ఎక్కువగా కనిపించే ఏస్–2 జన్యువుతోపాటు కరోనా వైరస్ కణంలోకి చొరబడేందుకు అవసరమైన ఒక ఎంజైమ్‌ను ఉత్పత్తి చేసే జన్యువులపై తాము పరిశోధనలు చేశామని, ఈ రెండూ వాసన చూసే వ్యవస్థ తాలూకు ఉపరితల కణాల్లో మాత్రమే ఉంటూ.. న్యూరాన్లలో మాత్రం లేవని తెలిసిందని ఆయన చెప్పారు. ఎలుకలు, ఇతర జంతువులపై కూడా ఇదే రకమైన పరిశీలనలు జరిపినప్పుడు వాటి న్యూరాన్లూ ఏస్–2 రిసెప్టెర్ జన్యువులను కలిగి లేవని స్పష్టమైందని ఈ సమాచారం మొత్తాన్నిబట్టి న్యూరాన్లతో కలిసి పనిచేసే కణాల్లో ఏస్–2 రిసెప్టర్ జన్యువులు ఉండటమే కోవిడ్ రోగులు వాసన శక్తిని కోల్పోయేందుకు కారణమని స్పష్టమైందని వివరించారు.
వైరస్‌తో వాసన కోల్పోయేది ఇందుకే..
Published Sun, Jul 26 2020 4:49 AM | Last Updated on Sun, Jul 26 2020 4:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment