
లక్నో : అయోధ్యలో నిర్మించే మసీదు ప్రారంభానికి ఆహ్వానిస్తే తాను హాజరు కాబోనని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యోగి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ శుక్రవారం డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు యోగి ఆదిత్యానాథ్ తాను చేసిన ప్రమాణానికి ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరించారని ఎస్పీ ప్రతినిధి పవన్ పాండే విమర్శించారు. రాష్ట్రమంతటికీ ఆయన ముఖ్యమంత్రని, హిందువులకు మాత్రమే కాదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న హిందూ, ముస్లింలందరికీ ఆయనే ముఖ్యమంత్రని..ఆయన అలా మాట్లాడటం గౌరవం అనిపించుకోదని పాండే అన్నారు.
ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అనంతరం యోగి ఆదిత్యానాధ్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఓ యోగి, హిందువుగా తాను మసీదు ప్రారంభానికి వెళ్లనని స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రిగా మీరు నన్ను అడిగితే ఏ విశ్వాసం, మతం, కులంతో నాకు ఎలాంటి సంబంధం లేదు..ఒక యోగిగా మీరు నన్ను అడిగితే హిందువుగా మసీదు ప్రారంభానికి వెళ్లబోను..హిందువుగా నా ప్రార్ధనా పద్ధతులను అనుసరించడం నా కర్తవ్యం..అందుకు అనుగుణంగా నడుచుకుంటా’నని యోగి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో తాను వాదిని కాదు..ప్రతివాదినీ కాదని అంటూ తనను పిలిచినా పిలవకపోయినా తాను హాజరుకానని..అసులు తనకు అలాంటి ఆహ్వానం అందబోదని ఆయన వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలపై ఎస్పీ మండిపడింది. ఆయన తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. చదవండి : మసీదు నిర్మాణానికి పిలుపు అందితే వెళ్తారా?
Comments
Please login to add a commentAdd a comment