చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే అక్రమాలకు పాల్పడితే.. అది కూడా తమకు ఉద్యోగాన్నిచ్చిన ప్రభుత్వాన్నే మోసగించాలని చూస్తే.. దాని పర్యవసానం ఎలా ఉంటుందో రాజస్థాన్‌లో వెల్లడయ్యింది. తమ స్థానంలో డమ్మీ టీచర్లను నియమించి, ఉద్యోగ విధులను చేస్తున్నట్లు నాటకమాడిన ఉపాధ్యాయ దంపతులపై ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పడింది.
రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో తమ స్థానంలో డమ్మీ టీచర్లను ఏర్పాటు చేసి, వారి చేత పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్న ఉపాధ్యాయ దంపతుల అక్రమాలపై విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి నుంచి రూ.9 కోట్ల 31 లక్షల 50 వేల 373 రికవరీ చేయాలని విద్యాశాఖ తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం విష్ణు గార్గ్ 1996 నుండి, అతని భార్య మంజు గార్గ్ 1999 నుంచి బరన్ జిల్లా పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు తమ బదులు డమ్మీ టీచర్లను నియమించి, వారిచేత విద్యార్థులకు బోధన సాగేలా చూస్తున్నారు. 2017లోనే వీరి వ్యవహారం బయటపడింది. అయితే రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉచ్చు బిగించింది.
పోలీసులు, విద్యా శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి, ఈ ఇద్దరు ఉపాధ్యాయుల స్థానంలో నియమితులైన ముగ్గురు డమ్మీ ఉపాధ్యాయులను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ ఉపాధ్యాయ దంపతులు అరెస్టుకు భయపడి పరారయ్యారు. అక్రమాలకు పాల్పడిన ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment