న్యూఢిల్లీ: భారత నావికా దళ విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్ విరాట్’ను విచ్ఛిన్నం చేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జాతి ప్రయోజనాల రీత్యా నావికాదళ నౌకని విచ్ఛిన్నం చేయరాదని, ఈ చారిత్రక నౌకను భద్రపరచాలని కోరుతూ ఓ ప్రైవేటు కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. ఈ నౌకను ప్రస్తుత యజమాని నుంచి కొనుగోలు చేసి, సముద్ర మ్యూజియంగా మార్చాలని భావిస్తోన్న ఎంఎస్ ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.
గత ఏడాది జరిగిన వేలంపాటలో దాదాపు రూ.65కోట్లకు శ్రీరాం షిప్ బ్రేకర్స్ దీన్ని కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని అలంగ్ బీచ్‌లో ఈ నౌకను విచ్ఛిన్నంచేయనుంది. రూ. 100 కోట్లకు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు ఎన్విటెక్ సంస్థ తెలిపింది. దీనిపై స్పందించాల్సిందిగా హోం శాఖను, నౌక ప్రస్తుత యజమానిని కోర్టు కోరింది. ఈ నౌకను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ గతంలో బాంబే హైకోర్టుని ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ కంపెనీ అభ్యర్థించింది. నౌకను కొనుగోలు చేసేందుకు ఎన్‌ఓసీ కోరిన ప్రైవేటు కంపెనీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా గత ఏడాది నవంబర్ 3న, జస్టిస్ నితిన్ జామ్‌దార్, జస్టిస్ మిలిండ్ జాధవ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment