సాక్షి, ముంబై: వచ్చే సంవత్సరం జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం శివసేన సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా గుజరాతీ ఓటర్లను ఆకట్టుకునేందుకు జనవరి 10వ తేదీన గుజరాతి సమ్మేళనం నిర్వహించనుంది. ఇందుకోసం ‘ముంబై మా జలేబీ ఫాఫడా... ఉద్దవ్ ఠాక్రే ఆపడా...’ అన్న హెడ్డింగుతో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ముంబైలో నివసించే గుజరాతీల కోసం ప్రత్యేకంగా జోగేశ్వరీలో సమ్మేళనం నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
వచ్చే ఏడాదిలో ఎన్నికలు..
2022 జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ముంబై, థానేతోపాటు మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ఈసారి ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు బీజేపీ అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తన పట్టును నిలుపుకునేందుకు శివసేన కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. చదవండి: (6 నెలల గరిష్టానికి నిరుద్యోగం)
ఇందులో భాగంగానే గుజరాతీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ విధంగా గుజరాతీ బాంధవుల కోసం సమ్మేళనం నిర్వహించాలని శివసేన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమ్మేళనంలో 100 మంది గుజరాతీ బాంధవులు శివసేనలో ప్రవేశించనున్నట్టు ప్రాథమికంగా తెలిసింది. శివసేన పదాధికారి హేమరాజ్ షాకు గుజరాతీలను శివసేన వైపు మళ్లించే బాధ్యతలను అప్పజెప్పింది. ఈ విషయంపై గుజరాతీతోపాటు మరాఠీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే పోటీ చేసిన వర్లీ నియోజకవర్గంలో కూడా ఆ సమయంలో ‘కేమ్ చో వర్లీ’ అనే గుజరాతీ బ్యానర్లతోపాటు తెలుగు, ఇతర భాషల బ్యానర్లు అంటించడం జరిగింది. ఆ సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
అయితే ఈసారి ఈ బ్యానర్ ఏర్పాటు చేసిన ఫలితం శివసేనకు ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా లభించే అవకాశాలున్నాయి. ఎలాగైన గుజరాతీ ఓటర్లను దక్కించుకుని ముంబైలో తన పట్టును నిలుపుకునేందుకు అన్ని విధాలుగా శివసేన ప్రయత్నించనుంది. మరోవైపు ఈ విషయంపై బీజేపీ మాత్రం ఇది ఎన్నికల స్టంట్‌గా పేర్కొంటోంది. ఎన్నికల సమయంలోనే ఇలాంటివన్నీ శివసేనకు గుర్తుకు వస్తాయంటూ ఆరోపనలు బీజేపీ గుప్పిస్తోంది. ‘‘ముంబై అల్లర్ల సమయంలో శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాలసాహెబ్ ఠాక్రే ఎలా సాయం చేశారో మొత్తం గుజరాతీ సమాజానికి తెలుసు. కొత్త తరానికి దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది, అందువల్ల మేం ఈ గుజరాతీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ‘అని శివసేన నాయకుడు, సమావేశ నిర్వాహకుడు హేమరాజ్ షా అన్నారు. 2022 ఫిబ్రవరిలో ఎన్నికలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జరుగుతాయని సేన పేర్కొంది.
ఉద్ధవ్ ప్రభుత్వం విఫలం: రామ్ కదం
బీజేపీ నాయకుడు రామ్ కదం మాట్లాడుతూ.. కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొవడంలో శివసేన నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముంబై, మహారాష్ట్రలు దేశంలోనే అత్యధిక కేసుల్లో అగ్రస్థానంలో ఉన్నాయని మండిపడ్డారు. అత్యధిక మరణాలూ ఇక్కడే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారనేదానికి దేశం మొత్తం సాక్ష్యంగా ఉందని రామ్ కదం విమర్శలు గుప్పించారు.
సీఎం ఉద్ధవ్ ఠాక్రే పెద్ద ప్యాకేజీ ఇస్తానని ప్రకటించారని, కానీ, అది ఎప్పడు ఇస్తారోనని, అసలు అది నిజమసన ప్రకటనా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజలు ఎలా మనుగడ సాగిస్తారో ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పంపిన ఆహార ధాన్యాలు ప్రజలకు ఆలస్యంగా పంపించారని మండిపడ్డారు. మహారాష్ట్రలో తుఫానులు సంభవించాయని, అయితే రైతులకు నష్టపరిహారం అందడం లేదని రామ్ కదం ఉద్ధవ్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment