Shraddha Murder Case: Delhi Police Narco Analysis And Polygraph Tests On Aftab - Sakshi
Sakshi News home page

శ్రద్ధా హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు.. అఫ్తాబ్‌పై నార్కో అనాలసిస్‌, పాలీగ్రాఫ్‌ టెస్టులు!

Published Mon, Nov 21 2022 7:12 PM | Last Updated on Mon, Nov 21 2022 7:55 PM

Shraddha Case: Delhi Police Narco Analysis Polygraph On Aftab - Sakshi

శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో.. నిందితుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడి అతిక్రూర స్వభావం బయటపడడంతో ఆధారాలను పక్కాగా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో.. నిందితుడిపై పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టు అనుమతి కోరారు. 

శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాపై పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించేందుకు సోమవారం సాకేత్‌ కోర్టులో ఢిల్లీ పోలీసులు పిటిషన​ వేశారు. ఈ కేసులో తొలుత పోలీసులను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించాడు నిందితుడు అఫ్తాబ్‌. అయితే చివరికి నేరం ఒప్పుకున్నప్పటికీ.. అతని సమాధానాలు పొంతన లేకుండా ఉంటున్నాయని పోలీసులు అంటున్నారు. ఇంతకు ముందు అఫ్తాబ్‌పై నార్కో అనాలసిస్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులకు సాకేత్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు.. 

అఫ్తాబ్‌పై పాలీగ్రాఫ్‌ పరీక్షల నిర్వహణకు అనుమతించాలని సాకేత్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే మెజిస్ట్రేట్‌ విజయశ్రీ రాథోడ్‌.. అఫ్తాబ్‌పై నార్కో అనాలసిస్‌ పరీక్ష నిర్వహణకు అనుమతించారు. దీంతో.. పాలిగ్రాఫ్‌ అనుమతించే విషయంపై తేల్చాల్సిందిగా మెజిస్ట్రేట్‌ రాథోడ్‌ అభిప్రాయసేకరణకు పోలీసుల పిటిషన్‌ను పంపించారు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ అవిరల్‌ శుక్లా. మంగళవారం ఈ పిటిషన్‌ విచారణకు రానుంది. 

మరోవైపు ఐదురోజుల కస్టడీ గడువు ముగియడంతో ఢిల్లీ పోలీసులు.. అఫ్తాబ్‌ను కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఢిల్లీ పోలీసులు కోర్టుకు ‘అఫ్తాబ్‌ తప్పుడు సమాచారం అందించాడని, దర్యాప్తును తప్పుదోవ పట్టించే యత్నం చేశాడ’ని కోర్టుకు నివేదిక సమర్పించారు. 

ఇక నిందితుడు అఫ్తాబ్‌పై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించొద్దని దర్యాప్తు అధికారులను ఆదేశించిన న్యాయస్థానం.. నార్కో అనాలసిస్‌ను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని గత గురువారం ఆదేశించింది. అయితే సోమవారం నిర్వహించాల్సిన ఈ పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక అతని తరపు న్యాయవాది ఎవరూ వాదించేందుకు ముందుకు రాకపోవడంతో.. న్యాయవాది హర్షిత్‌ సాగర్‌ను లీగల్‌ ఎయిడ్‌ కౌన్సెల్‌గా నియమించిన సంగతి తెలిసిందే. 

పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ ఎలా ఉంటుందంటే.. 
పాలీగ్రాఫ్‌ టెస్ట్‌.. నేర పరిశోధనలో ప్రయోగాత్మకమైన పద్ధతి. లైడిటెక్టర్ పరీక్ష అని కూడా వ్యవహరిస్తుంటారు. నిజాలను రాబట్టడం అనడం కంటే.. అబద్ధాలను గుర్తించడం అనే ట్యాగ్‌తో ఈ పరీక్షగా ఎక్కువగా పాపులర్‌ అయ్యింది. 1921లో కాలిఫోర్నియా యూనివర్సిటీ మెడికో జాన్ అగస్టస్ లార్సన్ ఈ విధానాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వైర్లు, ట్యూబుల్లాంటి వాటితో శరీరానికి సెన్సార్ల వంటి నిర్దిష్ట పరికరాలను జోడించి..  బీపీ, పల్స్, వివిధ భావోద్వేగాలు, శరీర కదలికలను జాగ్రత్తగా పర్యవేక్షించడం ద్వారా ఈ టెస్ట్‌ నిర్వహిస్తుంటారు. 

శరీరం ఎలా స్పందిస్తుందో నిశితంగా గమనించి ఆ వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో అనే నిర్ధారణకు అధ్యయనం చేపట్టడం ద్వారా వస్తారు. క్రిమినల్‌ కేసుల దర్యాప్తుల్లో కీలకంగా వ్యహరిస్తుంటుంది ఈ పరీక్ష.  కానీ, ఇదే ఫైనల్‌ రిజల్ట్‌ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. నేరస్థులు ప్రాక్టీస్‌ ద్వారా ఈ పరీక్ష నుంచి తప్పించుకున్న దాఖలాలు బోలెడు ఉన్నాయి. అందుకే ఈ పరీక్ష ఖచ్చితత్వంపై తరచు విమర్శలు వినిపిస్తుంటాయి.

నార్కో టెస్ట్‌.. 

ఈ పరీక్షకి ముందు కొన్ని మందులు లేదంటే ఇంజెక్షన్లు ఇస్తారు. తద్వారా నిందితుడు/అనుమానితుడు అపస్మార స్థితిలోకి జారుకుంటాడు. మనస్సుపై నియంత్రణ కోల్పోతాడు. అప్పుడు అతని ద్వారా నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో, సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవచ్చు. డోస్‌ ఎక్కువగా ఇస్తే కోమాలోకి వెళ్లిపోవడం లేదంటే చనిపోవచ్చూ కూడా. కాబట్టి, నార్కో టెస్ట్‌కు కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థల అనుమతి తప్పనిసరి. అంతేకాదు.. అతను నార్కో టెస్ట్‌కు అర్హుడేనా? అనేది కూడా బాడీ టెస్ట్‌ ద్వారా ధృవీకరించుకుంటారు.  

ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, మనస్తత్వవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగే టైంలో వీళ్లలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆ టెస్ట్‌ ఆపేయాల్సిందే!.. ఇక కొందరు ఈ పరీక్షలో కూడా దర్యాప్తు బృందాన్ని కూడా తప్పించుకుంటున్నారు. అందుకే ఈ పరీక్షపైనా తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, మన దేశంలో నార్కో టెస్ట్‌, పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ల ద్వారా కేసుల దర్యాప్తులో పురోగతి సాధించిన సందర్భాలు, కేసుల చిక్కుముడులు విప్పిన దాఖలాలే ఎక్కువగా నమోదు అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement