సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులనిరసనోద్యమం నిరాఘాటంగా కొనసాగుతోంది. ఈ ఆందోళనలను ఎప్పటికపుడు షేర్ చేస్తున్న ‘కిసాన్ ఏక్తా మోర్చా’ సోషల్ మీడియా ఖాతాను ఫేస్‌బుక్ బ్లాక్ చేయడం ఆందోళనకు దారితీసింది. ఉద్యమ వార్తలను ప్రజలకు అందిస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఆదివారం బ్లాక్ చేయడం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆన్‌లైన్ సెన్సార్‌షిప్‌పై వివాదం రాజుకుంది. ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై తాజాగా మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మూడు గంటల తరువాత ఆయా పేజీలు పునరుద్ధరించడటం గమనార్హం.
7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తమ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌ను ఫేస్‌బుక్ సంస్థ తొలగించిందని కిసాన్ ఏక్తా మోర్చా ఆరోపించింది. సోషల్ మీడియా పేజీలను బ్లాక్ చేశారని రైతు నేతలు తెలిపారు. ఆదివారం రైతు నేతల విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారం సాగుతుండగానే పేజ్‌ను బ్లాక్ చేశారని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్, క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ దర్శన్ పాల్ ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోషల్ మీడియాలను బ్లాక్ చేయడం వింతగా ఉందని , దీని వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని ఈ ఖాతాల వ్యవహారాలను చూస్తున్న బల్జిత్ సింగ్ మండిపడ్డారు. అయితే దీనిపై స్పందించిన ఫేస్‌బుక్ విచారం వ్యక్తం చేసింది. కిసాన్ ఏక్తా మోర్చా ఎఫ్‌బీ పేజీని పునరుద్ధరించాం, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఫేస్‌బుక్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే పేజీని ఎందుకు బ్లాక్ చేసిందీ పేర్కొనలేదు. మరోవైపు రైతులు (నేడు)సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment