అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు | SSP Sandeep Chaudhary of Srinagar helped Chana seller with 1 lakh | Sakshi
Sakshi News home page

అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు

Published Sat, Nov 20 2021 12:25 PM | Last Updated on Sat, Nov 20 2021 12:42 PM

SSP Sandeep Chaudhary of Srinagar helped Chana seller with 1 lakh - Sakshi

SSP Sandeep Chaudhary of Srinagar helped Chana seller with 1 lakh సాక్షి, ఇంటర్నెట్‌: బోసి నవ్వులు చిందిస్తున్న ఈ తాతను చూడగానే.. మనసుకు ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది కదా. కానీ ఈ తాతకు వచ్చిన కష్టం తెలిస్తే.. గుండె బద్దలవుతుంది. కష్టానికి కారకులైన వారి మీద ఎక్కడాలేని కోపం వస్తుంది. కొందరు సోమరిపోతుల మాదిరి కాకుండా.. వయసు మీద పడి.. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినప్పటికి కూడా.. పని చేయడం మానలేదు ఈ తాత. రోడ్డు పక్కన కూర్చుని పల్లీ, బఠాణీలు అమ్ముకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. 

ఇప్పటి వరకు పల్లీలు అమ్ముతూ దాదాపు లక్ష రూపాయల వరకు పోగు చేశాడు. తాను చనిపోయాక అంత్యక్రియలకు అక్కరకు వస్తుందని ఈ మొత్తాన్ని దాచుకున్నాడు. కానీ దరిద్రులు తాత కష్టార్జితాన్ని దొంగిలించారు. దీని గురించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఈ విషయం ఓ ఉన్నతాధికారికి తెలిసింది. వృద్ధుడి కష్టం అతడిని కదిలించింది. దాంతో తాత పొగొట్టుకున్న లక్ష రూపాయలను తానే అందించాడు. సదరు ఉన్నతాధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివారలు..
(చదవండి: Mrs Vishnoi: నాన్న కావాలని ఉందన్నారు.. కానీ తిరిగి రాలేదు.. అయినా)

జమ్మూ కశ్మీర్‌ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ రెహమాన్‌ అనే వృద్ధుడు రోడ్డు పక్క పల్లీలు, బఠాణీలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులు ఉన్నారో లేరే తెలియదు. ఒకవేళ ఉన్నా.. బతికున్నప్పుడు, మరణించిన తర్వాత కూడా తన వల్ల వారు ఇబ్బంది పడకూడదని భావించిన రెహమాన్‌.. రోడ్డు పక్కన పల్లీలు అమ్ముతూ తద్వారా వచ్చిన డబ్బును కూడబెట్టసాగాడు. ఇలా ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు దాచుకున్నాడు. 

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కొందరు దుండగులు రెహమాన్‌ అంత్యక్రియల కోసం దాచుకున్న మొత్తాన్ని దొంగిలించారు. పాపం జీవితాంతం కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము ఇలా దొంగలపాలవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు రెహమాన్‌. పోయిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకం ఏ కోశాన లేదు. అయినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
(చదవండి: 20ఏళ్ల అవమానాలు: బారాత్‌, డీజే, విందుతో వృద్ధ జంట పెళ్లి )

రెహమాన్‌ వ్యధ, బాధ శ్రీనగర్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ పోలీసు అధికారి సందీప్‌ చౌదరీని కదిలించింది. రెహమాన్‌ వివరాలు తెలుసుకున్న సందీప్‌.. అతడు పొగొట్టుకున్న లక్ష రూపాయలను రెహమాన్‌కు అందజేశాడు. దీని గురించి శ్రీనగర్‌ మేయర్‌ పర్వైజ్ అహ్మద్ ఖాద్రీ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. సందీప్‌ మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు. 

చదవండి: దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement