నక్షత్రాల జీవిత చరిత్రను వెల్లడించిన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో కొద్ది మందే ఉన్నారు. వారిలో ఒకరే సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయన సాధించిన ఘనతను ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే ఆయనకు ప్రముఖ భౌతిక శాస్త్రేవత్త సర్ సీవీ రామన్‌తో గల సంబంధం ఏమిటో కూడా తెలుసుకుందాం.
నక్షత్రాలపై పరిశోధనలు సాగించిన ప్రముఖ శాస్త్రవేత్తలు కోపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటర్ మొదలైన వారు వేసిన బాటలో పయనించి, నోబెల్ బహుమతిని సాధించిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ దక్షిణ భారతానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన 1910 అక్టోబర్ 19న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)లోని లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మి, చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు జన్మించారు.
హైస్కూలు, కాలేజీ చదువులను మద్రాస్ (చెన్నై)లో పూర్తిచేశారు. 1953లో డాక్టర్ చంద్రశేఖర్ అమెరికా పౌరసత్వం స్వీకరించకపోతే, ఆయనను మన భారతీయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సగర్వంగా ప్రకటించుకునే వాళ్లం. తన 19వ ఏట ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓడ మీద ఇంగ్లాండు వెళ్లిన ఆయన ఖగోళ శాస్త్ర సంబంధిత విషయాలపై అధ్యయనం సాగించారు. 1935 జనవరి 11న తన మిత్రుడు విలియం మాక్ క్రీ తో కలిసి ఇంపీరియల్ కాలేజీ నుంచి బర్లింగ్‌టన్ హౌస్ వెళ్లిన ఆయన తన పరిశోధనా పత్రాన్ని వేదికపై చదివి, భౌతిక ఖగోళ శాస్త్రవేత్తలను మంత్రుముగ్ధులను చేశారు. దీంతో కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజీ ఫెలోషిప్‌కు ఎన్నికయ్యారు. అక్కడ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌ను అందరూ ముద్దుగా ‘చంద్ర’ అని పిలిచేవారు.
ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్య దశలు ఉన్నట్టే నక్షత్రాల్లోనూ పరిణామ దశలుంటాయని ‘చంద్ర’ తెలిపారు. వీటిలో చెప్పుకోదగ్గవి అరుణ మహాతార (రెడ్‌జెయంట్), శ్వేత కుబ్జ తార (వైట్‌డ్వార్ఫ్), బృహన్నవ్య తార (సూపర్‌నోవా), నూట్రాన్ తార, కృష్ణ బిలం (బ్లాక్‌హోల్) అనే దశలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. తారలపై అవగాహనను పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.
సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను చంద్రశేఖర్ విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్‌డ్వార్ఫ్ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో తెలియజేసిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్ లిమిట్'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్‌డ్వార్ఫ్‌గా మారుతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్‌నోవాగా, న్యూట్రాన్‌స్టార్‌గా మారుతూ, చివరికి బ్లాక్‌హోల్ (కృష్ణబిలం)గా అయిపోతాయని చంద్రశేఖర్ సిద్ధాంతీకరించారు.
ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు మేథావులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒకరు నోబెల్ పొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. 1995 ఆగస్టు 21న అమెరికాలో తన 85వ ఏట చంద్రశేఖర్ గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా
Comments
Please login to add a commentAdd a comment