న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల మధ్య హింసాకాండలో ఆస్తి, ప్రాణనష్టం భారీగా సంభవించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హింసాత్మక ఘటనల బాధితులకు భద్రత, సాయం, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మణిపూర్‌లోని మైతీ వర్గం వారికి ఎస్‌టీ హోదాపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
‘బాధితుల కోసం ఎన్ని సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు? వాటిల్లో ఎందరున్నారు? ఆహారం, వైద్యం, భద్రత అందించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? సహాయక శిబిరాల నిర్వాహకులెవరు? నీడ కోల్పోయిన వారెవరు? వారిని తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారా?’అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు చర్యలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి నివేదించారు. ‘‘బాధితులు తలదాచుకుంటున్న ప్రార్థనాస్థలాలకు రక్షణ కల్పించాలి. సహాయక శిబిరాల్లో ఆహారం, రేషన్, వైద్యం వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి’ అని ధర్మాసనం సూచించింది.
హైకోర్టులకు ఆ అధికారం లేదు
రిజర్వేషన్లు కల్పించే అధికారం హైకోర్టులకు లేదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మణిపూర్ హైకోర్టులో మైతీలకు రిజర్వేషన్ల కోసం వాదించానంటూ ఒక లాయర్ ముందుకు రాగా.. రిజర్వేషన్లను సిఫారసు చేసే అధికారం హైకోర్టుకు లేదని తెలిపే రెండు రాజ్యాంగ ధర్మాసన తీర్పులను హైకోర్టుకు చూపించాలని ఆయన్ను కోరింది. రిజర్వేషన్లు కల్పించే అధికారాలు రాష్ట్రపతికే తప్ప హైకోర్టులకు లేవని మీరెన్నడూ హైకోర్టుకు తెలపలేదా అని ప్రశ్నించింది. మరోవైపు మణిపూర్ నుంచి జనం ఎలాగైనా బయటపడాలని తొందరపడుతున్నారు. ఇదే అవకాశంగా ఇండిగో, ఎయిర్‌ఏసియా వంటి సంస్థలు టికెట్ ధరలను పెంచేశాయి.
చదవండి: Karnataka Assembly election 2023: భారమంతా మోదీపైనే..
Comments
Please login to add a commentAdd a comment