న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో గుజరాత్, ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్-19 కట్టడికై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరులో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చనుందన్న వార్తల నేపథ్యంలో పరిస్థితులు దిగజారకముందే జాగ్రత్తపడాలని సూచించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక కరోనాపై సమర్థవంతంగా పోరాడేందుకు వీలుగా కేంద్రం నుంచి ఎటువంటి సాయం కోరుకుంటున్నాయో కూడా నివేదిక అందజేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. (చదవండి: కేవలం వెయ్యి మంది.. అవునా: ఢిల్లీ హైకోర్టు)
ఈ మేరకు రెండు రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్‌ఎస్ రెడ్డి, ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఈ నెలలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత కోవిడ్ పరిస్థితిపై రాష్ట్రాలన్నీ నివేదిక అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహమ్మారిపై యుద్ధానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోతే డిసెంబరులో అత్యంత ఘోరమైన, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. (చదవండి: రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు! )
కాగా ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, అసోంలలో గత కొన్నిరోజులుగా అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కోవిడ్-19 నిబంధనలు కఠినతరం చేసిన ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 44,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది.(చదవండి: కరోనా విజృంభణ; నైట్ కర్ఫ్యూ, సెక్షన్ 144 అమలు!)
Comments
Please login to add a commentAdd a comment