సాక్షి, బెంగళూరు : రోడ్డు మీద కుప్పులు కుప్పలుగా బంగారు నాణేలు అంటూ ప్రచారం. నిమిషాల్లో ఈ విషయం చుట్టుపక్కల పాకిపోయింది. ఇంకేముంది... బంగారు నాణేలను సొంతం చేసుకునేందుకు జనాలు భారీ ఎత్తున గుమ్మిగూడటంతో కొద్దిసేపు స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుసరిహద్దులోని హోసూరు తాలూకా బాగలూరు– సజ్జాపురం రోడ్డులోని పోలీసు క్వార్టర్స్ సమీపంలోని ఓ పొదలో బంగారు నాణేలు దొరుకుతున్నాయని శుక్రవారం సాయంత్రం ప్రచారం జరిగింది. దీంతో చిన్నాపెద్ద తేడా లేకుండా సుమారు 200 మందికిపైగా చేరుకొని నాణేల కోసం వెతకలాట ప్రారంభించారు.
నాణేలు దొరికిన కొంత మంది అక్కడి నుండి వెళ్లిపోగా మిగిలిన వారు గాలింపులు కొనసాగిస్తూ వచ్చారు. దీనితో బాగలూరు– సర్జాపురం రోడ్డులో ట్రాఫిక్ జామ్ తలెత్తింది. విషయం తెలుసుకొన్న బాగలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ సమస్యను క్రమబద్దీకరించారు. నాణేలపై హోసూరు తహసీల్దార్ సెందిల్‌కుమార్ మాట్లాడుతూ... ప్రజలకు దొరికిన కొద్ది నాణ్యాలను స్వాధీనపరుచుకొని పరిశీలించగా ఇత్తడి నాణేలుగా తెలిసింది. ఇత్తడి నాణేలను చూసి జనాలు బంగారు నాణేలు అనుకున్నారన్నారు. ఈ ఘటన హోసూరు ప్రాతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment