జమ్ములో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల దృష్ట్యా ఆర్మీ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ నుండి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించారు. 27వ తేదీ వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా విద్యార్థులకు బోధన జరగనుంది.
జూన్ 9న జమ్ము డివిజన్‌లోని రియాసీలో శివఖోడి నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత మరిన్ని ఉగ్ర దాడులు చోటుచేసుకున్నాయి. గత బుధవారం జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చారు. అదే సమయంలో ఒక సైనికుడు గాయపడ్డాడు.
అంతకుముందు జూలై 24న జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని బట్ సెక్టార్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు వీరమరణం పొందారు. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర ఘటనలను గుర్తించామన్నారు. సాధారణ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం తేదని, మన భద్రతా దళాలు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులందరిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment