ముంబై: మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహాయుతి భాగస్వామ్యపక్షాలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం. దీంతో సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమని ఆయా పార్టీలు చెబుతున్నాయి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని పేర్కొంటున్నాయి.
సీఎం పోస్టు కోసం బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నుంచి ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్‌పవార్) నుంచి అజిత్ పవార్ పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకోవడానికి అజిత్ పవార్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త సీఎం ఎవరన్నదానిపై బుధవారం ఉదయం కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని శివసేన(షిండే) అధికార ప్రతినిధి సంజయ్ సిర్సాత్ చెప్పారు.
మరోవైపు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిపారు. కానీ, అధికారికంగా ఆయన పేరు ఇంకా ఖరారు చేయలేదని అన్నారు. ఏ పార్టీకి ఎన్ని మంత్రిపదవులు, ఎవరెవరికి ఏయే శాఖలు ఇవ్వాలో నిర్ణయించిన తర్వాతే కొత్త సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీని సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. సీఎం ఎంపిక విషయంలో తమ పార్టీ అధిష్టానం తొందరపడడం లేదని తెలిపారు. మహాయుతిలో ఘర్షణకు తావులేకుండా సామరస్యపూర్వకంగా ముందుకు సాగాలన్నది తమ ఉద్దేశమని వివరించారు.
ఇదీ చదవండి: ‘మహా' డ్రామా: షిండే హ్యాపీయేనా? శివసేన ఏమంటోంది?
Comments
Please login to add a commentAdd a comment