
వెంటబడి మరీ పట్టుకున్న ఈడీ, సీఆర్‌పీఎఫ్ అధికారులు
పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయుల నియామక స్కామ్‌లో కొనసాగిన ఈడీ సోదాలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహాను ఈడీ అధికారులు అనూహ్యరీతిలో అరెస్ట్‌చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తన ఇంట్లో, తనకు సంబంధించిన స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారన్న సమాచారంతో అప్పటికప్పుడు ఎమ్మెల్యే తన ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి, తర్వాత ఎత్తయిన గోడ ఎక్కి బయటకు ఎలాగోలా దూకి పారిపోయారు. రెప్పపాటులో ఈ విషయం కనిపెట్టిన ఈడీ అధికారులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు వెంటనే ఆయన వెంటబడిమరీ సమీప పొలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆలోపే ఎమ్మెల్యే తన స్మార్ట్‌ఫోన్‌లను సమీపంలోని బురదకుంటలో పడేశారు. అయినాసరే పోలీసులు వాటిని వెలికితీసి స్వాధీనంచేసుకున్నారు.
మొబైల్‌లో కీలక సమాచారం ఉందని భావిస్తున్నారు. బురదకొట్టుకుపోయిన ఎమ్మెల్యేను పొలం గట్టు వెంట పోలీసులు అరెస్ట్‌చేసి తీసుకొస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముర్షీదాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఈ నాటకీయ పరిణామం జరిగింది. అరెస్ట్ తర్వాత సాహాను ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్ట ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆగస్ట్ 30వ తేదీదాకా ఈడీ రిమాండ్‌కు తరలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.
ఎమ్మెల్యే సాహా సంబంధ స్థలాలతోపాట రఘునాథ్‌గంజ్‌లోని సాహా కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల నివాసాల్లోనూ ఈడీ సోదాలుచేసి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనంచేసుకుంది. ఇదే టీచర్లు, స్టాఫ్ నియామక కేసులో 2023 ఏప్రిల్‌లో సాహాను సీబీఐ అధికారులు అరెస్ట్‌చేశారు. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఇదే కేసు విచారణలో భాగంగా ఆయనను ప్రశ్నించగా ఏమాత్రం సహకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అరెస్ట్‌చేయాల్సి వచ్చిందని న్యాయస్థానంలో హాజరుపర్చిన సందర్భంగా ఈడీ వాదించింది.
పశ్చిమబెంగాల్‌లో ప్రైమరీ టీచర్లతోపాటు 9, 10వ తరగతులు బోధించే అసిస్టెంట్ టీచర్లు, గ్రూప్–సి, డి సిబ్బంది నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని సీబీఐ తొలుత కేసు నమోదుచేసింది. ఇందులోని వివరాలతో తర్వాత ఈడీ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి దర్యాప్తును మనీలాండరింగ్ కోణంలో విస్తృతస్థాయిలో దర్యాప్తుచేసింది. ఈ కుంభకోణంలో కీలకసూత్రధారిగా భావిస్తున్న నాటి విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహాయకురాలు అర్పితా ముఖర్జీ, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అరెస్ట్‌చేశాయి.
#Breaking: #TMC MLA from Burwan, Murshidabad district, Jiban Krishna Saha arrested by ED in connection with SSC scam.
Sources in ED say, Jiban Krishna Saha tried to jump the boundary wall of the house & flee when ED officials reached his residence this morning. This apart, he… pic.twitter.com/ff5MBD21Yq— Pooja Mehta (@pooja_news) August 25, 2025