న్యూఢిల్లీ: భారత్‌లో కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) నిబంధనలు తాము పాటిస్తామని ట్విట్టర్ యాజ మాన్యం తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వంతో కొన్నాళ్లుగా సాగుతున్న ఘర్షణకు ముగింపు పలుకుతూ తాజాగా తన మొదటి ‘ఇండియా ట్రాన్స్‌పరెన్సీ రిపోర్టు’ను విడుదల చేసింది. అంతేకాకుండా నిబంధనల మేరకు రెసిడెంట్ ఫిర్యాదు అధికారిని(ఆర్‌జీఓ) నియమించింది. ట్విట్టర్ యాజమాన్యం ఇటీవలే చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. భారత్‌లో ట్విట్టర్ నూతన రెసిడెంట్ ఫిర్యాదు అధికారిగా వినయ్ ప్రకాశ్ నియమితులయ్యారు. దేశంలో కొత్త ఐటీ రూల్స్ మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో మధ్యంతర ఫిర్యాదు అధికారిగా ధర్మేంద్ర చతుర్‌ను ట్విట్టర్ నియమించింది. కొన్ని వారాల్లోనే ఆయన తప్పుకున్నారు. వాస్తవానికి అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జెర్మీ కెస్సెల్‌ను ఇండియాలో ఫిర్యాదుల పరిష్కార అధికారిగా నియమించాలని ట్విట్టర్ తొలుత నిర్ణయించింది. అయితే, కొత్త ఐటీ నిబంధనల ప్రకారం సామాజిక వేదికల కీలక అధి కారులు భారత్‌లోనే నివసిస్తూ ఉండాలి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ‘‘నాలుగో అంతస్తు, ద ఎస్టేట్, 121 డికెన్సన్ రోడ్, బెంగళూరు–560042’’ అనే చిరునామాలో తమను సంప్రదించవచ్చని ట్విట్టర్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. మే 26 నుంచి జూన్ 25 వరకూ 94 ఫిర్యాదులు అందినట్లు తెలిపింది.
ఐటీ రూల్స్‌తో యూజర్ల రక్షణ
నూతన ఐటీ నిబంధనలతో సోషల్ మీడియా వేదికల యూజర్లకు మరింత రక్షణ లభిస్తుందని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం చెప్పారు. మరింత బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వ్యవస్థ కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment