Union Minister's House Set On Fire By Mob In Manipur - Sakshi
Sakshi News home page

Manipur: కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి

Published Fri, Jun 16 2023 12:55 PM | Last Updated on Fri, Jun 16 2023 1:13 PM

Union Minister House Set On Fire By Mob In Manipur - Sakshi

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు నేటికి చల్లారడం లేదు. నెల రోజులు దాటినా రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా వెయ్యి మందికిపైగా నిరసనకారులు ఇంఫాల్‌లోని కేంద్రమంత్రి ఆర్రం‌కే జన్ సింగ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో గుంపుగా ఎగబడిన జనం మంత్రి ఇంటిపై పెట్రోల్‌ బాంబులు విసిరినట్లు ఆయన నివాస భద్రతా సిబ్బంది వెల్లడించారు.

అయితే ఘటన జరిగిన సమయంలో మంత్రి ఇంఫాల్‌లోని ఇంట్లో లేరని మణిపూర్ అధికారులు తెలిపారు. ఇంఫాల్‌లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆందోళనకారులు కొంగ్బాలోని మంత్రి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో  మంత్రి నివాసంలో తొమ్మిది మంది ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డ్స్‌,  ఎనిమిది మంది అడిషనల్‌ గార్డ్స్‌ విధుల్లో ఉన్నారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 

కాగా భారీగా నిరసనకారులు దూసుకురావడంతో వారిని అడ్డుకోలేకపోయామని ఎస్కార్ట్ కమాండర్ ఎల్‌ దినేశ్వర్ సింగ్ వెల్లడించారు. మంత్రి ఇంటి ముందు, వెనక అన్ని వైపుల నుంచి నుంచి బాంబులు విసరడంతో పరిస్థితిని నియంత్రించలేకపోయామని  పేర్కొన్నారు. ముకదాడి చేసిన వారిలో దాదాపు 1,200 మంది ఉన్నారని తెలిపారు. కాగా రంజన్‌ సింగ్‌ ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి. మే నెలలో కూడా ఇంటిపై దాడికి యత్నం జరగ్గా.. భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపి నిరసనకారులను చెదరగొట్టారు.
చదవండి: గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం..

ఇక ఆర్కే రంజన్‌ సింగ్‌ ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాలు, విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అయితే ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఆయన అధికారిక పనిపై కేరళలో ఉన్నట్లు మంత్రి రంజన్ సింగ్ చెప్పారు. తన ఇల్లు పెట్రోలు బాంబుల దాడిలో దెబ్బతిందని తెలిపారు. మణిపూర్‌లో శాంతి స్థాపనకు అందరూ కలిసి రావాలని కేంద్రమంత్రి కోరారు. కాగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఆయన మెయిటీ, కుకీ వర్గానికి చెందిన ప్రముఖులతో చర్చలు జరిపారు. అలాగే హింసను ప్రేరేపిస్తోన్న స్థానిక నేతలను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement