7 నుంచి దశలవారీగా మెట్రో రైళ్లు.. | Unlock 4.0 Guidelines: Metro Services To Resume From September 7 | Sakshi
Sakshi News home page

అన్‌లాక్‌ 4: 7 నుంచి మెట్రో..

Published Sun, Aug 30 2020 1:01 AM | Last Updated on Sun, Aug 30 2020 9:55 AM

Unlock 4.0 Guidelines: Metro Services To Resume From September 7 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల మరిన్ని కార్య కలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోం శాఖ అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను ప్రకటించింది. పలు నగరాలకు ప్రాణాధారంగా మారిన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ ఏడో తేదీ నుంచి దశలవారీగా మెట్రో రైళ్లను నడపడానికి కేంద్రం అనుమతించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు మాత్రం సెప్టెంబర్‌ 30వ తేదీ దాకా మూసే ఉంటాయని ప్రకటిం చింది. విద్యా సంస్థలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను స్వల్పంగా సడలించింది. సెప్టెంబర్‌ 21 నుంచి 50 శాతం మించకుండా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది హాజరుకావొచ్చని, 9 నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులు స్వచ్ఛందంగా గైడెన్స్‌ కోసం హాజరుకావొచ్చని పేర్కొంది.

బార్లను కూడా నిషేధిత జాబితా నుంచి కేంద్రం తొలగించింది. జూలై 29న జారీచేసిన అన్‌లాక్‌ 3 మార్గదర్శకాల్లో యోగా కేంద్రాలు, వ్యాయామ శాలలకు మినహాయింపు ఇవ్వగా.. ప్రస్తుతం నిషేధిత జాబితా నుంచి బార్లను తొలగించింది. శనివారం రాత్రి జారీచేసిన ఈ మార్గదర్శకాలు సెప్టెంబర్‌ 1 నుంచి దశలవారీగా అమల్లోకి రానున్నాయి. కొత్త మార్గదర్శకాలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి, వివిధ మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన అభిప్రాయాలు, విస్తృత సంప్రదింపుల తరువాత జారీచేసినట్టు కేంద్రం తెలిపింది. వివాహ వేడుకలకు కూడా సెప్టెంబర్‌  21 నుంచి స్వల్పంగా ఆంక్షలు సడలించింది.

అన్‌లాక్‌ 4 మార్గదర్శకాలు ఇవీ..
 మెట్రో రైలు సర్వీసులను సెప్టెంబర్‌ 7 నుంచి దశలవారీగా పునరుద్ధరించేందుకు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖకు అనుమతించింది. దీనికి సంబంధించి, ప్రామాణిక నియమావళిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీచేస్తుంది.
– సామాజిక, విద్యా, క్రీడలు, వినోదం, సాంస్కతిక, మతపరమైన, రాజకీయపరమైన వేడుకలు, సమావేశాలు, ఇతర సమ్మేళనాలకు అనుమతించింది. అయితే వీటికి 100 మందికి మించి హాజరుకాకూడదన్న ఆంక్ష విధించింది. సెప్టెంబర్‌ 21 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు ఫేస్‌ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. థర్మల్‌ స్కానింగ్‌ అందుబాటులో ఉంచడం, హ్యాండ్‌ వాష్‌ లేదా శానిటైజర్‌ ఏర్పాటు చేయడం తప్పనిసరి.
– సెప్టెంబరు 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది.
– పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్‌ సంస్థలు సాధారణ తరగతి కార్యకలాపాల కోసం 2020 సెప్టెంబర్‌ 30 వరకు మూసి ఉంటాయి. ఆన్‌లైన్‌ తరగతులు, దూరవిద్య తరగతులు కొనసాగుతాయి. 
– రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించకుండా ఎలాంటి లాక్‌డౌన్‌ (కంటైన్‌మెంట్‌ ప్రాంతాల వెలుపల) విధించకూడదు. 

సెప్టెంబరు 21 నుంచి అనుమతించేవిః
– ఆన్‌లైన్‌ బోధన, టెలీ–కౌన్సెలింగ్, సంబంధిత పనుల కోసం 50 శాతానికి మించకుండా బోధన, బోధనేతర సిబ్బందిని పాఠశాలలకు పిలవడానికి రాష్ట్రాలు అనుమతించవచ్చు.
– కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు తమ పాఠశాలలను స్వచ్ఛంద ప్రాతిపదికన సందర్శించవచ్చు. వారి ఉపాధ్యాయుల నుంచి మార్గదర్శకత్వం తీసుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు. ఇది వారి తల్లిదండ్రులు, సంరక్షకుల రాతపూర్వక సమ్మతికి లోబడి ఉంటుంది.
– నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్సి్టట్యూట్స్, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్సి్టట్యూట్స్‌ (ఐటిఐ), నేషనల్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ లేదా స్టేట్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ మిషన్స్‌ లేదా భారత ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నమోదు చేసుకున్న స్వల్పకాలిక శిక్షణా కేంద్రాలలో నైపుణ్యం లేదా వ్యవస్థాపకత శిక్షణకు అనుమతి ఉంటుంది.
– నేషనల్‌ ఇన్సి్టట్యూట్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్మాల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఐఈఎస్‌బీయూడీ), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (ఐఐఇ)లకు అనుమతి ఉంటుంది.
– ప్రయోగశాల, ప్రయోగాత్మక పనులు అవసరమయ్యే సాంకేతిక, వృత్తిపరమైన కోర్సుల పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులను అనుమతిస్తారు. 

కొన్నింటినికి ‘నో’... మరికొన్నింటిపై పరిమితులు
– సినిమా హాళ్ళు, స్విమ్మింగ్‌ పూల్స్, ఎంటర్టైన్మెంట్‌ పార్కులు, థియేటర్లు (ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ మినహా), ఇలాంటి ప్రదేశాలకు అనుమతి లేదు.
– హోం శాఖ అనుమతి ఇచ్చినవి మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. 
– వివాహ వేడుకలకు సెప్టెంబరు 20 వరకు 50 మందికి మించి అనుమతించరాదు. సెప్టెంబరు 21 నుంచి 100 మంది వరకు అనుమతి ఉంటుంది. 
– అంత్యక్రియలకు సెప్టెంబరు 20 వరకు 20 మందికి మించరాదు. సెప్టెంబరు 21 నుంచి వంద మంది వరకు అనుమతిస్తారు.
– కంటైన్‌మెంట్‌ జోన్లలో సెప్టెంబరు 30 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉంటాయి. 

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement