ఎంబీబీఎస్‌తో.. కేంద్ర ప్రభుత్వ కొలువు | UPSC Combined Medical Services Exam 2021: Preparation Guidance, Eligibility, Full Details Here | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌తో.. సర్కారీ కొలువు

Published Mon, Jul 19 2021 7:22 PM | Last Updated on Mon, Jul 19 2021 7:33 PM

UPSC Combined Medical Services Exam 2021: Preparation Guidance, Eligibility, Full Details Here - Sakshi

ఎంబీబీఎస్‌ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ కొలువుకు మార్గం.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే.. కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎంఎస్‌ఈ)! ఈ పరీక్షలో విజయం సాధించి.. ఆ తర్వాత ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపితే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు శాఖల్లో కొలువు సొంతమవుతుంది. అంతేకాకుండా రూ.56,100–1,77,500 వేతన శ్రేణి అందుకోవచ్చు. ఇటీవల యూపీఎస్సీ సీఎంఎస్‌ఈ–2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. సీఎంఎస్‌ఈ పరీక్ష వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. 

ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు.. వైద్య రంగంలో ఉన్నత కెరీర్‌ సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీబీఎస్‌ తర్వాత స్పెషలైజేషన్లు చదవాల్సిన ఆవశ్యకత నెలకొంది. కాని యూపీఎస్‌సీ నిర్వహించే సీఎంఎస్‌ఈ ద్వారా ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే కేంద్ర కొలువుల సాధన దిశగా అడుగులు వేయొచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య 838
యూపీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం–కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు విభాగాల్లో రెండు కేటగిరీలుగా మొత్తం 838 వైద్యుల పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు. 

కేటగిరీ–1: సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో జూనియర్‌ స్కేల్‌ పోస్ట్‌లు – 349.
కేటగిరీ–2: రైల్వేస్‌లో అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లు–300.
► న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లు–5.
► ఈస్ట్, నార్త్, సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లలో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌–2) పోస్ట్‌లు –184.


అర్హత

► ఎంబీబీఎస్‌ ఫైనల్‌ రాత పరీక్షలు, ప్రాక్టికల్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

► చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది.

► కంపల్సరీ రొటేటింగ్‌ ఇంటర్న్‌షిప్‌లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాకే అపాయింట్‌మెంట్‌ ఖరారు చేస్తారు.

వయో పరిమితి
► ఆగస్ట్‌ 1, 2021 నాటికి 32ఏళ్లు మించకూడదు. 

►  సెంట్రల్‌ హెల్త్‌ సర్వీసెస్‌లో జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు ఆగస్ట్‌ 1,2021 నాటికి 35ఏళ్లు మించకూడదు.

► ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.


వేతనాలు

► ఇండియన్‌ రైల్వేలో అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా గ్రూప్‌–ఎ జూనియర్‌ స్కేల్‌తో.. రూ.56,100–రూ.1,77,500 వేతన శ్రేణితో ప్రారంభ వేతనం లభిస్తుంది.

► సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్,ఇతర విభాగాల్లోనూ ఇదే వేతన శ్రేణితో ప్రారంభ వేతనం అందుతుంది. 

► ఆయా విభాగాల్లో సర్వీస్‌లో చేరిన అభ్యర్థులు నిర్దిష్ట కాలంపాటు ప్రొబేషన్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రొబేషన్‌ పిరియడ్‌లో సంతృప్తికరమైన పనితీరు కనబర్చిన వారికే శాశ్వత కొలువు ఖరారవుతుంది.

రెండంచెల ఎంపిక ప్రక్రియ
► కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పోస్ట్‌ల భర్తీకి రెండంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

► తొలి దశలో సీఎంఎస్‌ఈ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నిర్దిష్ట కటాఫ్‌లు సొంతం చేసుకున్న వారితో మెరిట్‌ జాబితా రూపొందించి..ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు చొప్పున పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్‌లోనూ విజయం సాధిస్తే.. తుది విజేతల జాబితాలో నిలిచి కొలువు ఖాయం చేసుకున్నట్లే!

రాత పరీక్ష.. 500 మార్కులు
► సీఎంఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు చొప్పున 500 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 

► పేపర్‌–1: జనరల్‌ మెడిసిన్‌ అండ్‌ పిడియాట్రిక్స్‌. ఈ పేపర్‌లో జనరల్‌ మెడిసిన్‌ నుంచి 96 ప్రశ్నలు, పిడియాట్రిక్స్‌ నుంచి 24 ప్రశ్నలు చొప్పున మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు.

► పేపర్‌–2ను మూడు భాగాలుగా వర్గీకరించారు. అవి..ఎ)సర్జరీ; బి)గైనకాలజీ అండ్‌ ఆబ్‌స్టెట్రిక్స్‌; సి)ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌.

► ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం మార్కులు 120.

► నెగెటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3ను తగ్గిస్తారు. 


చివరి దశ.. పర్సనాలిటీ టెస్ట్‌

► అయిదు వందల మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. చివరి దశలో అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆయా శాఖల్లోని పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి.. 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ పర్సనాలిటీ టెస్ట్‌లో అభ్యర్థుల్లోని జనరల్‌ నాలెడ్జ్‌ను, వైద్యరంగం పట్ల వారికున్న ఆసక్తిని, సేవాదృక్పథాన్ని, వ్యక్తిత్వాన్ని, నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపితే తుది ఎంపిక ఖరారవుతుంది. 

సర్వీసు ప్రాధాన్యత అవకాశం
► సీఎంఎస్‌ఈ రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు.. ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే డిటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌లో తమకు ఆసక్తి ఉన్న సర్వీసుల ప్రాధాన్యతను వరుస క్రమంలో పేర్కొనొచ్చు. తుది విజేతల జాబితాను రూపొందించేటప్పుడు ఈ ప్రాధాన్యతలను, అభ్యర్థులు పొందిన మార్కు లను బేరీజు వేస్తూ ఆయా విభాగాల కేటాయింపులో తుది నిర్ణయం తీసుకుంటారు.

సీఎంఎస్‌ఈ–2021 ముఖ్య సమాచారం
► మొత్తం పోస్టుల సంఖ్య: 838
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ:జూలై 27,2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తు ఉపసంహరణకు అవకాశం: ఆగస్ట్‌ 3–ఆగస్ట్‌ 9
► సీఎంఎస్‌ఈ పరీక్ష తేదీ: నవంబర్‌ 21, 2021
► తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
► వివరాలకు వెబ్‌సైట్‌: www.upsc.gov.in
► ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://upsconline.nic.in


రాత పరీక్షలో విజయానికి

► పేపర్‌–1(జనరల్‌ మెడిసిన్, పిడియాట్రిక్స్‌) లో..కార్డియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, జెనిటో యూరినరీ, న్యూరాలజీ, హెమటాలజీ, ఎండోక్రైనాలజీ, మెటాబాలిక్‌ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్‌–కమ్యూనికబుల్‌ డిసీజెస్, న్యూట్రిషన్‌/గ్రోత్, డెర్మటాలజీ, మస్కులోస్కెలిటిల్‌ సిస్టమ్,సైకియాట్రీ, జనరల్‌ అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పిడియాట్రిక్స్‌కు సంబంధించి.. కామన్‌ చైల్డ్‌హుడ్‌ ఎమర్జెన్సీస్, బేసిక్‌∙న్యూబార్న్‌కేర్, నార్మల్‌ డెవలప్‌మెంటల్‌ మైల్‌స్టోన్స్, ఇమ్యునైజేషన్‌ ఇన్‌ చిల్డ్రన్, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులను గుర్తించడం, వారికి చికిత్స మార్గాలు తదితర అంశాలపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి.

పేపర్‌–2కు ఇలా
► పేపర్‌–2లోని మూడు విభాగాలకు సంబంధించి దృష్టి పెట్టాల్సిన అంశాలు..

► సర్జరీ: జనరల్‌ సర్జరీకి సంబంధించి గాయా లు, కాలేయం, రక్త నాళాలు, పేగులు, కణితులు, ఉదర సంబంధ సమస్యలు తదితరాలకు సంబంధించిన శస్త్రచికిత్స  అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు యూరాలజికల్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, ఈఎన్‌టీ సర్జరీ, థొరాసిక్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌ సర్జరీ, ఆప్తమాలజీ, అనస్థీషియాలజీ, ట్రామటాలజీ అంశాలను అవపోసన పట్టాలి. 

► గైనకాలజీ అండ్‌ ఆబ్‌స్టెట్రిక్స్‌: గైనకాలజీలో అప్లయిడ్‌ అనాటమీ, అప్లయిడ్‌ ఫిజియాలజీ, జెనిటల్‌ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్లు, నియోప్లాస్మా, గర్భాశయం స్థానంలో మార్పులు, కన్వెన్షనల్‌ కాంట్రాసెప్టివ్స్, యూడీ, ఓరల్‌ పిల్స్, ఆపరేటివ్‌ ప్రొసీజర్, మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ అంశాలపై దృష్టి సారించాలి. 

► ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌: సోషల్‌ అండ్‌ కమ్యూనిటీ మెడిసిన్, కాన్సెప్ట్‌ ఆఫ్‌ హెల్త్, డిసీజ్, ప్రివెంటివ్‌ మెడిసిన్, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ప్లానింగ్, డెమోగ్రఫీ అండ్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్, ఆక్యుపేషనల్‌ హెల్త్, జెనిటిక్స్‌ అండ్‌ హెల్త్, ఇంటర్నేషనల్‌ హెల్త్, మెడికల్‌ సోషియాలజీ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్, మెటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్, నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. 

అకడమిక్‌ పుస్తకాలు ఆలంబనగా
రాత పరీక్షలో మెరుగ్గా రాణించడానికి అభ్యర్థులు తమ అకడమిక్‌ పుస్తకాలనే ఆలంబనగా చేసుకుని ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సిలబస్‌ను పరిశీలించి.. అకడమిక్స్‌లోని అంశాలతో బేరీజు వేసుకుంటూ.. అప్లికేషన్‌ దృక్పథంతో చదవాలి. పాత ప్రశ్న పత్రాల సాధన కూడా ఎంతో ఉపకరిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement