
రాంచీ: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్ జిల్లాలోని రామ్ నగర్ ప్రాంతం వద్ద ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ధేలా నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయంలో కారులో 11 మంది ప్రయాణిస్తుండగా వారిలో ఓ బాలిక కూడా ఉంది.
బాధితులంతా పంజాబ్‌కు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ధేలా నది ఉప్పొంగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ నీటి ప్రవాహం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని కుమావోన్ రేంజ్ డీఐజీ ఆనంద్ భరన్ తెలిపారు.
ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఎర్టిగా కారు శుక్రవారం ఉదయం 5 గంటలకు కార్బెట్ వైపు వెళుతోంది. వేగంగా వెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ధేలా గ్రామంలోని నది వంతెనపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు నీటిలో కొట్టుకుపోయింది’ అని తెలిపారు. ఇదిలా ఉండగా నదిపై వంతెన నిర్మాణం లేకపోవడంతో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.
చదవండి: రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మృతి
Comments
Please login to add a commentAdd a comment