
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగింది. నేడు గురువారం ఉదయం 8 గంటలకే కార్మికులను బయటకు తీసుకురావాల్సి ఉండగా, తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది.
రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగిస్తున్న భారీ యంత్రాలు, కంప్రెసర్ యంత్రాల యజమాని శైలేష్ గులాటీ మీడియాతో మాట్లాడారు. కార్మికుల దగ్గరకు చేరేందుకు చేస్తున్న తవ్వకాల్లో ఐదారు మీటర్ల మేరకు తవ్వాల్సి ఉండగా, ఇనుప శిధిలాలు అడ్డుపడటంతో పనులను ఆపాల్సి వచ్చిందన్నారు. శిథిలాలలో ఇనుప పైపులు, రాడ్లు ఉన్నాయన్నాయన్నారు. వీటిని తొలగించి, కార్మికుల దగ్గరకు చేరుకునేందుకు సాంకేతిక సాయాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారి రాకతో సహాయక చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి.
లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతున్నామని, ఆహారం అందించడానికి అమర్చిన పైపు ద్వారానే సంభాషణ జరుగుతున్నదని శైలేష్ గులాటీ తెలిపారు. కూలీలకు పూర్తిస్థాయిలో ఆహారం అందిస్తున్నామని, ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మాత్రమే పంపించామని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్