
మనుషులకు మల్లే పశుపక్ష్యాదులు భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. పిల్లల కోసం అల్లలాడిపోవడం, ఆపదలో అవసరమైతే పోరాడడం, యజమానుల పట్ల విశ్వాసం, ఆప్యాయత-ప్రేమల్ని ప్రదర్శించడం ఈ కోవలోకే చెందుతాయి కూడా. అయితే మృతి చెందిన తన నేస్తాన్ని పూడ్చడానికి వెళ్తుంటే.. ఆ బాధను తట్టుకోలేక ఓ పక్షి చేసిన పని నెటిజనుల హృదయాన్ని కరిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని కుచేర ప్రాంతంలో రామస్వరూప్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇంటి వద్ద రెండు నెమళ్లు సందడి చేసేవి. ఎక్కడి నుంచో వచ్చిన వాటికి రోజూ ధాన్యం గింజలు వేస్తున్నాడాయన. అలా నాలుగేళ్లు గడిచిపోయింది. అయితే అందులో ఓ నెమలి మృతి చెందింది. దీంతో ఇద్దరు వ్యక్తులను పురమాయించి ఆ నెమలిని పూడ్చమని చెప్పాడు రామస్వరూప్. నెమలి మృతదేహాన్ని పూడ్చడానికి తీసుకువెళ్లున్న క్రమంలో.. పాపం మరో నెమలి దాని వెంట పరుగులు తీసింది.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నెమలి తన సహచర నెమలిని విడిచి ఉండలేకపోతోంది. హృదయాన్ని కదిలించే వీడియో’ అని కామెంట్ జతచేశారు. అలా పరుగులు తీసిన నెమలి.. ఖననం చేసేదాకా ఆ నెమలి అక్కడే ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఆ నెమలి పరుగులు తీసిన వీడియోను 1.26 లక్షల మంది వీక్షించారు.
నెమలి వీడియో వీక్షించిన నెటిజనులు హార్ట్ టచింగ్ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘మనుషుల కంటే పక్షులు, పశువులకే ప్రేమ అధికంగా ఉంటుంది!’, ‘ఆ నెమలి ఎంత బాధ అనుభవిస్తోందో.. పక్షి ప్రేమికులకు తెలుస్తుంది’, ‘దేవుడి సృష్టి చాలా గొప్పదని.. ప్రేమ, అనుబంధాలకు సంబంధించి ఆ నెమలి ఆధునిక మానవుని కళ్లు తెరిపిస్తోంది’, ‘నువ్వు లేక నేనుండలేను నేస్తం.. నువ్వు ఎక్కడికి పోతున్నావ్!’ అని నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు.
The peacock doesn’t want to leave the long time partner after his death. Touching video. Via WA. pic.twitter.com/ELnW3mozAb
— Parveen Kaswan (@ParveenKaswan) January 4, 2022