ఛత్తీస్‌ సీఎంగా విష్ణుదేవ్‌ సాయ్‌ | Vishnu Deo Sai To Be New Chhattisgarh CM | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌ సీఎంగా విష్ణుదేవ్‌ సాయ్‌

Published Mon, Dec 11 2023 4:49 AM | Last Updated on Mon, Dec 11 2023 4:49 AM

Vishnu Deo Sai To Be New Chhattisgarh CM - Sakshi

రాయ్‌పూర్‌: బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర చర్చోపచర్చల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో నూతన ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. ఆదివారం రాయ్‌పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు హాజరైన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో విష్ణుదేవ్‌ సాయ్‌ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 59 ఏళ్ల విష్ణుదేవ్‌ రాష్ట్రంలోని సుర్గుజా ప్రాంతంలోని జష్‌పూర్‌ జిల్లా కుంకురీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఈ ప్రాంతంలోని మొత్తం 14 స్థానాల్లోనూ బీజేపీనే విజయబావుటా ఎగరేసింది. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్‌ నడ్డాలకు విష్ణుదేవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఎన్నిలక హామీ ప్రకారం వెంటనే హౌజింగ్‌ పథకం కింద 18 లక్షల ఇళ్లు ఇస్తామని ఆయన ప్రకటించారు.

రాయ్‌పూర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల భేటీకి 54 మంది పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ అధిష్టానం పంపిన పర్యవేక్షకులు అర్జున్‌ ముండా, శర్బానంద సోనోవాల్, దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌లు హాజరయ్యారు. సమావేశం తర్వాత రాష్ట్ర గవర్నర్‌ను విష్ణుదేవ్‌ తదితరులు కలిశారు. దీంతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కాబోయే ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆహా్వనించారని రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో బీజేపీ 54 చోట్ల గెలిచింది.  

సర్పంచ్‌గా మొదలై ఆదివాసీ సీఎం దాకా...
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ కీలక నేతల్లో విష్ణుదేవ్‌ ఒకరు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు. సర్పంచ్‌గా రాజకీయ జీవితం మొదలెట్టి ఆ తర్వాత పలుమార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా మూడుపర్యాయాలు పనిచేసి అధిష్టానం మెప్పు పొందారు. 1990లో బగియా గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. అదే ఏడాది అవిభాజ్య మధ్యప్రదేశ్‌లో తప్‌కారా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  1999, 2004, 2009లో రాయ్‌గఢ్‌ ఎంపీగా గెలిచారు. మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలిస్తే విష్ణుదేవ్‌ను ‘పెద్దనేత’ను చేస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారసభలో అమిత్‌ షా ప్రకటించడం తెల్సిందే. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక అజిత్‌ జోగీ తొలి ఆదివాసీ సీఎంగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్న ఆదివాసీ నేతగా విష్ణుదేవ్‌ పేరు నిలిచిపోనుంది. విష్ణుదేవ్‌ తాత బుద్ధనాథ్‌ సాయ్‌ 1947–52 వరకు నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పెదనాన్న నరహరి ప్రసాద్‌ రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జనతాపార్టీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగాచేశారు. ఇంకో పెదనాన్న సైతం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement