‘కూ’ అకౌంట్‌ ఓపెన్‌ చెయ్యాలంటే... | War With Twitter BJP And Ministers Buck Up Desi Alternative Koo | Sakshi
Sakshi News home page

‘కూ’ అకౌంట్‌ను ఇలా ఓపెన్‌ చేయండి..

Published Thu, Feb 11 2021 8:28 AM | Last Updated on Thu, Feb 11 2021 4:46 PM

War With Twitter BJP And Ministers Buck Up Desi Alternative Koo - Sakshi

చేతిలో కత్తి ఉన్నవాడికి భయపడని లోకం నోటిలో బూర ఉన్నవాడికి వణికి చస్తుంది. ఏదో ఒకటి ఊదేస్తాడు వాడు.. ఉన్నదీ లేనిదీ. అదీ జడుపు. ట్విట్టర్‌ వచ్చి మనిషికొక బూర ఇచ్చింది. ‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌.. వాటీజ్‌ దిస్‌ అండీ..!’ అని కామన్‌ మ్యాన్‌ తన బూర ఊదొచ్చు. ‘మిత్రోం..’ అని మన మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. దేవుడితో డైరెక్టుగా మాట్లాడినట్లు కామన్‌ మ్యాన్‌తో కనెక్ట్‌ అవొచ్చు. అంతటి మహా ట్విట్టర్‌తో సరిపడక ఇప్పుడు భారత ప్రభుత్వం ‘కూ’  (Koo) అనే సొంత బూరల యాప్‌ను క్రియేట్‌ చేసుకుంది. ఇంకా కొన్ని దేశాలు ఇలాంటి ‘సొంత బూర’ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌తో ప్రభుత్వాలకు ఎందుకు పడటం లేదు? ట్విట్టర్‌పై ఉన్న విమర్శలు ఏమిటి? ఆ విమర్శలు ప్రభుత్వానివా, ప్రజలవా?

‘ఐ యామ్‌ నౌ ఆన్‌ కూ..’ అని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ మంగళవారం ఒక ట్వీట్‌ పెట్టారు. ‘కూ’ అనేది ఇండియన్‌ ట్విట్టర్‌. మనం సొంతంగా డెవలప్‌ చేసుకున్నది. మేడ్‌ ఇన్‌ ఇండియా! అయితే ట్విట్టర్‌ ఎంత శక్తిమంతమైనదో చూడండి. ‘కూ’లో చేరిన సంగతిని కూడా మంత్రిగారు మళ్లీ ట్విట్టర్‌లోనే పెట్టవలసి వచ్చింది! ఆయనతోపాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ‘కూ’లో అకౌంట్‌ తెరిచారు. కొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా ‘కూ’ లోకి చేరాయి. ‘కూ’లో ప్రత్యేకతలకు మళ్లీ వద్దాం. అసలు ట్విట్టర్‌కు పోటీగా ‘కూ’ను మన ప్రభుత్వం ఎందుకు వృద్ధి చేసింది? డిజ్‌అగ్రిమెంట్‌! ఒప్పుదలకు అనంగీకారం. ట్విట్టర్‌ ఏం చేస్తే అది చెల్లుబాటు అవడం భారత్‌కే కాదు.. ప్రపంచంలోని దేశాలకు, దేశాధినేతలకు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తెచ్చిపెడుతోంది. సోషల్‌ మీడియాలో అత్యంత శక్తిమంతమైన మైక్రో–బ్లాగ్‌ ప్లాట్‌ఫారమ్‌ అయిన ట్విటర్‌ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ హద్దులు మీరుతోందన్న విమర్శలు.. ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్‌ని బ్యాన్‌ చేశాక ఎక్కువయ్యాయి.  

ట్విట్టర్‌ ఎంతో.. ‘కూ’ అంత
ట్విట్టర్‌ అమెరికన్‌ మేడ్‌. కూ మేడిన్‌ ఇండియా. కూ అకౌంట్‌ ఓపెన్‌ చెయ్యాలంటే ఓటీపీ అవసరం. ట్విట్టర్‌కు ఓటీపీ అక్కర్లేదు. ‘కూ’ యాప్‌ హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళ్, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, ఇంకా ఇతర భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం కోసం అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్‌ బిదావత్కా అనేవారు పది నెలల క్రితం ‘కూ’ని రూపొందించారు. మోదీ తన మన్‌కీ బాత్‌లో వారిద్దరినీ ప్రశంసించారు కూడా. ఇప్పుడిప్పుడు కూ దేశానికి అలవాటవుతోంది. కూ ని గూగుల్‌ ప్లే నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ట్విట్టర్‌ లో మనం షేర్‌ చేసుకునేవన్నీ ‘కూ’లోనూ చేసుకోవచ్చు. 
చదవండి: 500 మంది ట్విటర్‌ ఖాతాలు రద్దు
కూలో చేరిన కంగనా: ట్విటర్‌కు కౌంటర్‌

వారి ఖాతాలను బ్లాక్‌ చేస్తుంది
మార్చి 21 వస్తే ఈ ఏడాదికి ట్విట్టర్‌కు పదిహేనేళ్లు నిండుతాయి. కువకువలాడే పక్షి ట్విట్టర్‌ గుర్తు. ఆ పక్షి గూడు హెడ్‌ క్వార్టర్స్‌ ఉన్నది కాలిఫోర్నియాలో. ట్విట్టర్‌ బాస్‌ జాక్‌ డోర్సీ. ట్విట్టర్‌లో ఎవరైనా అకౌంట్‌ తీసుకోవచ్చు. ఎవరు ఏదైనా, ఎవరు ఎవరితోనైనా మాట్లాడొచ్చు. అయితే ఆ మాటల వల్ల ఎవరి మనోభావాలూ దెబ్బతినేందుకు లేదు. ఆ మాటలు విద్వేషాలకు కారణం అవకూడదు. స్త్రీలను ఏ విధంగానూ కించపరచకూడదు. ప్రభుత్వాలను కూలదోయకూడదు. ఇవన్నీ జాక్‌ డోర్సీ పెట్టిన నిబంధనలు. వాటిని యూజర్స్‌ ఎవరైనా ఏ రూపంలోనైనా అతిక్రమిస్తే ట్విట్టర్‌ ఆ అతిక్రమించిన వారి ఖాతాలను బ్లాక్‌ చేస్తుంది. ఇక వాళ్లు ట్వీట్‌ ఇవ్వలేరు. ట్వీట్‌లు పొందలేరు. ప్రముఖులకైతే అదొక అవమానం.. ట్విట్టర్‌ తమ అకౌంట్‌ను తొలగించిందంటే! చూడండి మరి. ప్రముఖుల కంటే ప్రముఖమైన మైక్రో–బ్లాగింగ్‌ ప్లాట్‌ఫారమ్‌. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆస్ట్రేలియన్‌ మాజీ రేసర్, ప్రస్తుతం అడల్ట్‌ స్టార్‌ అయిన రెనీ గ్రేసీల అకౌంట్‌లను ట్విట్టర్‌ ఈమధ్యనే తొలగించింది. జనవరి 6న అమెరికా పాలనా భవనం ‘క్యాపిటల్‌ హిల్‌’ లో అరాచకానికి ట్రంప్‌ పెట్టిన ట్వీట్‌లే పెట్రోలు పోశాయని నమ్మిన ట్విట్టర్‌ ఆయన అకౌంట్‌ని బ్లాక్‌ చేసింది. ఇక రెనీ గ్రేసీ ట్విట్టర్‌ గూడును వదిలిపెట్టవలసి రావడానికి కారణం.. పోర్న్‌స్టార్‌గా నానాటికీ ఆమె ఫొటోలు ‘ప్రఖ్యాతిగాంచడం’.
(ట్విటర్‌కు షాక్‌: దేశీ ట్విటర్ ‘కూ’ జోరు)

వీళ్లిద్దరే కాదు.. హాలీవుడ్‌ నటి రోస్‌ మెక్‌గోవన్, అమెరికన్‌ గాయని బ్యాంక్స్, అమెరికన్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్టిన్‌ ష్రేలీ, అమెరికన్‌ ర్యాపర్‌ కర్టిస్‌ జాక్సన్, అమెరికన్‌ గాయని కోర్ట్నీ లవ్, స్వీడిష్‌ యూ ట్యూబర్‌ ప్యూడీపీ, బ్రిటిష్‌ గాయని అడేర్, మన దేశం నుంచి బాలీవుడ్‌ నేపథ్య గాయకుడు అభిజీత్‌ భట్టాచార్య, బాలీవుడ్‌ నటుడు కమాల్‌ఖాన్‌.. ట్విట్టర్‌ ఆగ్రహానికి గురై గూడు కోల్పోయిన వారిలో ఉన్నారు. మంచి పనే. తిన్నగా లేనివారిని తీసివేయవలసిందే. మరి ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవారిని ట్విట్టర్‌ తొలగించడం లేదు కదా అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. ప్రశ్నిస్తున్నది ప్రజలే కనుక, ప్రజలకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటుంది కనుక, ఆ స్వేచ్ఛను అకౌంట్‌ క్లోజ్‌ చేయడం ద్వారా హరించడం అప్రజాస్వామ్యం అవుతుంది కనుక తాము ఆ పని చేయబోమని ట్విట్టర్‌ తరచు చెబుతూనే ఉంటుంది. సహజంగానే ప్రభుత్వాలను సంతృప్తిపరచని ధోరణి ఇది. మన దేశంలోనే చూడండి. రైతు ఉద్యమానికి ట్విట్టర్‌ వేదికగా ప్రపంచవ్యాప్త మద్దతు లభిస్తుండటంతో ప్రభుత్వం ట్విట్టర్‌పై అసంతృప్తితో ఉంది. 

సెన్సార్‌ విధించాయి.
ట్విట్టర్‌పై అసంతృప్తితో లోగడ ట్విట్టర్‌ను బ్యాన్‌ చేసిన, మళ్లీ యాక్సెస్‌ ఇచ్చిన దేశాలు కూడా ఉన్నాయి. కొన్ని దేశాలు సెన్సార్‌ విధించాయి. ఫ్రాన్స్, ఇజ్రాయిల్, పాకిస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, టాంజానియా, టర్కీ, వెనిజులా, చైనా, ఈజిప్టు, ఇరాన్, ఉత్తర కొరియా, టర్క్‌మెనిస్తాన్, బ్రిటన్‌లు ‘ఆన్‌ అండ్‌ ఆఫ్‌’ ట్విట్టర్‌ను నిషేధిస్తూ, నిషేధాన్ని సడలిస్తూ వస్తున్నాయి. ఇండియా ఆ స్థాయిలో నిషేధించలేదు కానీ, అల్లర్లను ప్రేరేపించే ప్రమాదం ఉన్న కొన్ని అకౌంట్‌లను ట్విట్టర్‌ చేత బ్లాక్‌ చేయించగలిగింది. ఏమైనా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ట్విట్టర్‌ మీదే ఆధారపడి పరుగులు తీస్తున్నాయి.

దేశాధినేతల మనసులోని మాట ప్రజలకు తెలియాలంటే మునుపు సుదీర్ఘమైన ప్రెస్‌ మీట్లు, ఆ ఏర్పాట్లు అవసరం అయ్యేవి. ఇప్పుడు పీఎం గానీ, ప్రెసిడెంటు గానీ ఇంట్లో కూర్చొని క్షణాల్లో, అదీ రెండంటే రెండే ముక్కల్లో దేశాన్నంతటినీ ఉద్దేశించి వర్తమానం ఇవ్వగలుగుతున్నారు. ఇక ప్రజా ఉద్యమాలకైతే ట్విట్టర్‌ హ్యాష్‌ట్యాగ్‌లు పెద్ద చోదకశక్తి. బ్లాక్‌ లైవ్జ్‌ మేటర్, మీటూ, బ్రింగ్‌ బ్యాక్‌ అవర్‌ గర్ల్స్, ఐస్‌ బకెట్‌ చాలెంజ్, స్కూల్‌ స్ట్రయిక్‌ 4 క్లైమేట్, నెవర్‌ అగైన్‌ వంటి ఎన్నో ఉద్యమాలకు ట్విట్టర్‌ తొలి వేదిక అయింది. 

ప్రజా ఉద్యమాల వరకు ప్రభుత్వం సహిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రజాఉద్యమాలను మాత్రం సీరియస్‌గా తీసుకుంటుంది. అయితే ట్విట్టర్‌కు ఈ ఉద్యమాలతో సంబంధం ఉండదు. ఒక పరిమితి వరకు భావ వ్యక్తీకరణకు ప్లాట్‌ఫామ్‌ అవుతుంది. వ్యక్తీకరణ మితి మీరితే అకౌంట్‌లు బ్లాక్‌ చేస్తుంది.. పౌరులవైనా, రాజకీయ నాయకులవైనా. ఒక పెద్ద ఆన్‌లైన్‌ ప్రజాస్వామ్య రాజ్యం ట్విట్టర్‌. ఆ ప్రజాస్వామ్యం దుర్వినియోగం అవుతున్నట్లు అనిపించినప్పుడు పోటీగా తామూ ఒక ట్విట్టర్‌ను పెట్టుకోవాలన్న ఆలోచన ప్రభుత్వాలకు కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు మన దేశం ప్రారంభించిన ‘కూ’ కూడా ఒక ప్రత్యామ్నాయ ట్విట్టర్‌ వంటిదే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement