ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాలయాలలోని ఎత్తైన పర్వతాలపై భారీ హిమపాతం కురుస్తుండగా, అక్కడి మైదాన ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఐదు జాతీయ రహదారులతో సహా 300కు పైగా రోడ్లను మూసివేశారు. హిమాచల్‌లో 263 రోడ్లు మూసివేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.
గడచిన 24 గంటల్లో పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలతో సహా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇంతేకాదు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్, ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ ప్రాంతం, సిక్కిం, అస్సాం, మేఘాలయ, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యింది.
వాతావరణంలోని మార్పుల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పలుప్రాంతాల్లో 11 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ రాజస్థాన్‌లోని చురులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని పర్వత, మైదాన ప్రాంతాల్లో బుధవారం కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment