
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు సంభవిస్తున్నాయి. దీంతో 128 రహదారులు మూతపడ్డాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 15 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మండీ, బిలాస్‌పూర్, సోలన్, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాల్లో వరద ముప్పు ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. బలమైన గాలులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి తాకిడి కారణంగా పంటలు దెబ్బతినే అవకాశాలున్నాయని, బలహీనమైన నిర్మాణాలు, కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మండీలో 60, కులులో 37, సిమ్లాలో 21, కాంగ్రాలో ఐదు, కిన్నౌర్‌లో నాలుగు, హమీర్‌పూర్ జిల్లాలో ఒక రోడ్డును మూసివేశారు. అలాగే 44 విద్యుత్, 67 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడింది.
మండీ జిల్లాలోని జోగిందర్‌నగర్‌లో అత్యధికంగా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మశాలలో 125.4, కటౌలాలో 112.3, భరారీలో 98.4, కందఘాట్‌లో 80, పాలంపూర్‌లో 78.2, పండోహ్‌లో 76, బైజ్‌నాథ్‌లో 75, కుఫ్రీలో 70.8, కుఫ్రిలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు 9 వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 28 శాతంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో సగటున 445.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటుంది. ఇప్పుడు 321.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.