గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ యునెస్కో వారసత్వ జాబితాలో చేరింది. శాంతినికేతన్ నాటి రోజుల్లో భారతదేశంలో ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఒక విశ్వవిద్యాలయం. దీనిని మనం ఇప్పుడు విశ్వభారతి అని కూడా పిలుస్తున్నాం. గురుదేవులు శాంతి నికేతన్‌ను ప్రారంభించినప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్.. త్రిపురతోపాటు అనేక రాజ కుటుంబాల నుండి ఆర్థిక సహాయం అందుకున్నారు. ఆ సమయంలో చైనా కూడా శాంతినికేతన్ నిర్వహణకు భారీగా ఆర్థిక సహాయం అందించింది.
చైనా అందించిన ఆర్థిక సహాయానికి గుర్తుగా శాంతి నికేతన్‌లోని చైనా భవన్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ విద్యాలయంలో చైనీస్ భాష బోధించడంతో పాటు, చైనా సంస్కృతిపై అధ్యయనం చేస్తారు. శాంతి నికేతన్‌కు గొప్ప సహాయం అందించిన చైనా పండితుని పేరు తాన్ యున్ జెన్. ఆయన చదువుకునేందుకు శాంతి నికేతన్‌కు వచ్చారు. ఆ తర్వాత ఈ యూనివర్సిటీకి భారీగా ఆర్థిక సాయం అందించారు. తాన్ యున్ జెన్ శాంతినికేతన్ క్యాంపస్‌లో చైనా భవనాన్ని నిర్మించి, దానిని అభివృద్ధి చేసిన వ్యక్తి. అతను రచయిత, కవి, వ్యాసకర్త, తత్వశాస్త్ర పండితుడు. అలాగే భాషావేత్త. మహాయాన బౌద్ధ, కన్ఫ్యూషియన్ పండితునిగానూ పేరుగాంచారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ 1924లో చైనాను సందర్శించారు. మూడు సంవత్సరాల తర్వాత గురుదేవులు మలయాలో తాన్‌ను కలిశారు. అనంతరం అతను చదువుకోవడానికి శాంతి నికేతన్‌కు వచ్చారు. అతను ఇక్కడ భారతీయ సంస్కృతిని అభ్యసించారు. కాగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఠాగూర్ కొత్త విభాగాలను తెరవలేకపోయారు. గురుదేవులు చైనీస్ సంస్కృతి, భాష బోధించే ఒక విభాగాన్ని కూడా స్థాపించాలనుకున్నారు. 1931లో తాన్ నిధుల సేకరణ కోసం సింగపూర్, రంగూన్, చైనా దేశాలకు వెళ్లారు. దాదాపు ఐదేళ్ల తర్వాత శాంతినికేతన్‌కు తిరిగి వచ్చి రూ.50 వేల ఆర్థిక సహాయంతో పాటు లక్ష పుస్తకాలను అందించారు. తరువాత ఆయన శాంతినికేతన్‌లోనే ఉండిపోయారు. 30 ఏళ్లపాటు శాంతినికేతన్‌కు సేవలు అందించారు. 1937 ఏప్రిల్ 14న చైనా భవన్ ఏర్పాటయ్యింది. దీనిని ఇందిరాగాంధీ ప్రారంభించారు. చైనా ప్రతినిధి చియాంగ్ కై-షేక్ 1957లో శాంతి నికేతన్‌ను సందర్శించినప్పుడు చైనా హాల్, విశ్వవిద్యాలయానికి భారీ ఆర్థిక సహాయం అందించారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో ఏడు ఎకరాల స్థలంలో ఆశ్రమాన్ని స్థాపించారు. అదే నేడు విశ్వభారతిగా పేరొందింది. ఠాగూర్ 1901లో కేవలం ఐదుగురు విద్యార్థులతో ఇక్కడ పాఠశాలను ప్రారంభించారు. వీరిలో అతని కుమారుడు కూడా ఉన్నాడు. 1921లో జాతీయ విశ్వవిద్యాలయ హోదా పొందిన విశ్వభారతిలో ప్రస్తుతం 6000 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్ క్యాంటీన్‌లో ఏమేమి దొరుకుతాయి? ధరలు ఎంత?
Comments
Please login to add a commentAdd a comment