2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలిచిన టాప్- 5 అభ్యర్థులంతా బీజేపీకి చెందినవారే కావడం విశేషం. వారెవరో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేశారో తెలుసుకుందాం.
1. నవ్సారి (గుజరాత్). సీఆర్ పాటిల్
ఈ స్థానం నుండి 2019లో బీజేపీ చెందిన సీఆర్ పాటిల్ 6 లక్షల 89 వేల 668 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌కు చెందిన ధర్మేష్ పటేల్‌పై విజయం సాధించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ.. సీఆర్‌పాటిల్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. సీఆర్ పాటిల్ గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఆయన విజయ పతాకం ఎగరేశారు.
2. కర్నాల్ (హర్యానా)- సంజయ్ భాటియా
హర్యానాలోని ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా 6 లక్షల 56 వేల 142 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మపై విజయం సాధించారు. సంజయ్ భాటియాకు 70 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ సంజయ్ భాటియాకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది.
3. ఫరీదాబాద్ (హర్యానా)- కృష్ణపాల్ గుర్జార్
హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ గుర్జార్ కాంగ్రెస్ అభ్యర్థి అవతార్ భదానాపై 6 లక్షల 38 వేల 239 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి కూడా బీజేపీ కృష్ణపాల్ గుర్జార్‌ను రంగంలోకి దించింది.
4. భిల్వారా (రాజస్థాన్) - సుభాష్ చంద్ర
బీజేపీ అభ్యర్థి సుభాష్ చంద్ర కాంగ్రెస్ అభ్యర్థి రామ్ పాల్ శర్మపై 6 లక్షల 12 వేల ఓట్లతో విజయం సాధించారు. 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కాలేదు. ఈ టికెట్ కోసం పలువురు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు.
5. వడోదర (గుజరాత్)- రంజన్‌బెన్ భట్
గుజరాత్‌లోని వడోదర నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్ 5.89 లక్షల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రశాంత్ పటేల్‌పై విజయం సాధించారు. బీజేపీ మరోసారి రంజన్‌బెన్ భట్‌ను రంగంలోకి దించింది. గత రెండు లోభసభ ఎన్నికల్లోనూ ఆయన విజయం దక్కించుకున్నారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడి నుంచి వైదొలగినప్పటి నుంచి రంజన్‌బెన్ భట్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment