ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్‌ | UP will give momentum to India's growth story in the 21st century | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్‌

Published Sat, Jun 4 2022 6:01 AM | Last Updated on Sat, Jun 4 2022 8:33 AM

UP will give momentum to India's growth story in the 21st century - Sakshi

లక్నో/కాన్పూర్‌: 21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధి చరిత్రకు ఉత్తరప్రదేశ్‌ ఊపునిస్తుందని, దేశానికి చోదకశక్తిగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేడు ప్రపంచం అన్వేషిస్తున్న ఒక నమ్మకమైన భాగస్వామిగా భారత్‌ అవతరించిందని చెప్పారు. నమ్మకమైన భాగస్వామిగా తనను తాను నిరూపించుకొనే సత్తా ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు మాత్రమే ఉందన్నారు.

శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో మూడో పెట్టుబడిదారుల సదస్సును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రంగాల్లో రూ.80,000 కోట్లకు పైగా విలువైన 1,406 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు భారత్‌కు ఎన్నెన్నో గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టాయని వివరించారు. ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని, మన శక్తి సామర్థ్యాలను కొనియాడుతోందని గుర్తుచేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...

అదొక సరికొత్త రికార్డు
‘‘జి–20 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్లోబల్‌ రిటైల్‌ సూచికలో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో చమురు, విద్యుత్, గ్యాస్‌ శక్తిని ఉపయోగించుకొనే దేశాల్లో మూడో స్థానంలో ఉంది. గతేడాది 100కు పైగా దేశాల నుంచి ఇండియాకు రికార్డు స్థాయిలో 84 బిలియన్‌ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 417 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశాం. ఇదొక సరికొత్త రికార్డు.

సంస్కరణలు కొనసాగుతాయ్‌
మన ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. ఎనిమిదేళ్లుగా సంస్కరణ–పనితీరు–మార్పు అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం. విధాన నిర్ణయాల్లో స్థిరత్వం, పరస్పర సహకారం, సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నాం. ‘ఒకే దేశం–ఒకే పన్ను, ఒకే దేశం–ఒక్కటే రేషన్‌ కార్డు’ వంటివి మన స్పష్టమైన, బలమైన ప్రయత్నాలకు నిదర్శనం. రక్షణ రంగంలో తయారీకి గతంలో ఎవరూ ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆత్మనిర్భర్‌ అభియాన్‌లో భాగంగా 300 రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారు చేసుకోబోతున్నాం. రక్షణ తయారీ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టబోతున్నవారికి మార్కెట్‌ సిద్ధంగా ఉంది. దేశంలో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయి. భారత్‌ స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని రంగాల్లో సంస్కరణలు చేపడతాం.

నవ్య కాశీని సందర్శించండి
2014 పోలిస్తే ఇప్పుడు దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. అప్పట్లో 6 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ ఖాతాదారులు ఉండేవారు. ఇప్పుడు 78 కోట్లకు చేరారు. జీబీ డేటా ధర రూ.200 ఉండేది రూ.11–12కు దిగొచ్చింది. 2014లో 100 కంటే తక్కువ గ్రామాలే ఆప్టికల్‌ ఫైబర్‌తో కనెక్ట్‌ అయ్యాయి. ఇప్పుడు వాటి సంఖ్య 1.75 లక్షలు. 70 వేల దాకా రిజిస్టర్డ్‌ స్టార్టప్‌లు ఉన్నాయి. యూపీలో నా సొంత నియోజకవర్గం వారణాసిని సందర్శించాలని పెట్టుబడిదారులను కోరుతున్నా.

ఘనమైన పురాతన చరిత్ర ఉన్న కాశీ నవ్యత్వాన్ని సంతరించుకుంటోంది’’ అని మోదీ వెల్లడించారు. యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన దారుల సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్తలు గౌతమ్‌ అదానీ, కుమార మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పెట్టుబడులు, ఉద్యోగాల గురించి వివరించారు. మోదీ విజన్‌కు అనుగుణంగా పని చేస్తున్నారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

బలమైన ప్రతిపక్షం ఉండాలి
వంశ పారంపర్య రాజకీయాలపై (పరివార్‌వాద్‌) ప్రధాని మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. యూపీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పూర్వీకుల గ్రామమైన పరౌంఖ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వంశ పారంపర్య రాజకీయాల వల్ల ప్రతిభావంతులకు అవకాశాలు దక్కకుండా పోతాయన్నారు.

అలాంటి రాజకీయాలు చేసేవారంతా తనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారని చెప్పారు. వారి ఆటలను ప్రజలు సాగనివ్వరని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో జన్మించిన వారు కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి కావాలంటే వంశ పారంపర్య రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు.  దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తానని మోదీ చెప్పారు. దానివల్ల రాజకీయాల్లో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు.

అంతకముందు కాన్పూర్‌ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి రాష్ట్రపతి కోవింద్‌ స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికేందుకు రాష్ట్రపతి రావడం పట్ల తనకు సిగ్గుగా ఉందని మోదీ అన్నారు. కోవింద్‌ మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని చెప్పారు. తమ పూర్వీకుల గ్రామాన్ని సందర్శించిన మోదీకి రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. పరౌంఖ్‌లో పథ్రీమాత ఆలయాన్ని, బీఆర్‌ అంబేడ్కర్‌ భవనాన్ని, మిలన్‌ కేంద్రాన్ని కోవింద్‌తో కలిసి మోదీ సందర్శించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement