2024కు త్వరలో వీడ్కోలు చెప్పబోతున్నాం. 2025ను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నాం. ఈ 2024లో మనకు కొన్ని మంచి అనుభవాలతోపాటు చేదు రుచులు కూడా ఎదురయ్యాయి. అదే సమయంలో కొందరు రాజకీయ ప్రముఖలు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలేమిటో, ఆ ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మల్లికార్జున్ ఖర్గే
ఈఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. ఆయన తన విమర్శల్లో ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను టార్గెట్‌గా చేసుకున్నారు. ‘భారత్‌లో రాజకీయంగా అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్’ అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాంగ్లీలో జరిగిన బహిరంగ సభలో ఖర్గే వ్యాఖ్యానించారు. ‘అవి విషం లాంటివి. ఆ పాము కాటేస్తే మనిషి చనిపోతాడు. అలాంటి విష సర్పాలను చంపేయాలి’ అని కూడా అన్నారు. ఇదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసిన ఖర్గే ఆయనను తైమూర్ లాంగ్‌తో పోల్చారు. 400 సీట్లు ఖాయమనే నినాదం అందుకున్న మోదీ ప్రభుత్వం అటు జేడీయూ, ఇటు టీడీపీల అండదండలపైనే ఆధారపడిందని ఖర్గే విమర్శించారు. అలాగే ప్రధాని మోదీని అబద్ధాల నేత అని కూడా ఖర్గే వ్యాఖ్యానించారు. ఇవి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.
లాలూ ప్రసాద్
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన విమర్శలతో ఈ ఏడాది హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ చేపట్టిన మహిళా సంవాద్ యాత్రపై విరుచుకుపడ్డారు. దీనిపై జేడీయూ, బీజేపీలు లాలూపై ప్రతివిమర్శలకు దిగాయి. ‘ఇంతకుముందు లాలూజీ శారీరకంగా మాత్రమే అనారోగ్యంతో ఉన్నారని, ఇప్పుడు మానసికంగా కూడా అస్వస్థతకు గురయ్యారని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి విమర్శించారు. నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా లాలూ చేసిన వ్యాఖ్యానాలు చాలా అసహ్యకరమైనవి, అవమానకరమైనవని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ
రాహుల్ తన విదేశీ పర్యటనల సందర్భంగా భారత్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించే ప్రకటనలు చేశారు. వాషింగ్టన్‌లో రాహుల్ మాట్లాడుతూ భారత్‌లో మతస్వేచ్ఛ తగ్గుతోందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించినప్పుడే రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి భారతదేశంలో లేదని రాహుల్ మరో కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇవి పెను రాజకీయ దుమారాన్ని రేపాయి.
గిరిరాజ్ సింగ్
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఛత్ పండుగ రోజున స్వచ్ఛత గురించి మాట్లాడుతూ సిమ్లాలోని ఒక మసీదు వివాదంపై వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర దుమారాన్ని రేపాయి. మనం ఐక్యంగా ఉంటే మహ్మద్ ఘోరీ, మొఘల్ లాంటివారెవరూ మనల్ని ఓడించలేరని కూడా గిరిరాజ్ సింగ్ అన్నారు.
ఇల్తిజా ముఫ్తీ
ఇల్తిజా ముఫ్తీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె. ఆమె ‘హిందుత్వం’ను ఒక వ్యాధిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇల్తిజా ముఫ్తీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఈ వివాదానికి తెరలేపారు.
సామ్ పిట్రోడా
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఉత్తర భారత్‌లోని ప్రజలు తెల్లగా కనిపిస్తారని, తూర్పు భారత్‌లోని వారు చైనీయులుగా కనిపిస్తారని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అలాగే దక్షిణ భారత్ ప్రజలు ఆఫ్రికన్‌ల మాదిరిగా కనిపిస్తారని, పశ్చిమ భారతదేశ ప్రజలు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారన్నారు. సామ్ ప్రకటనపై దుమారం రేగడాన్ని చూసిన కాంగ్రెస్ వీటికి దూరంగా ఉంది. ఈ వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది.
భాయ్ జగ్‌తాప్
కాంగ్రెస్ నేత భాయ్ జగ్‌తాప్ గతంలో ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ ‘ఎన్నికల కమిషన్ ఒక కుక్క.. ప్రధాని మోదీ బంగ్లా బయట కూర్చుని కాపలా కాస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన ఏజెన్సీలన్నీ ఇప్పుడు కీలుబొమ్మలుగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఈ ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయి. వ్యవస్థను ఎలా తారుమారు చేస్తున్నారో దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు తెలియజేస్తున్నాయని’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం
Comments
Please login to add a commentAdd a comment