కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ
● మూడు దశల్లో నిర్వహణ ● సద్వినియోగం చేసుకుంటే మేలు
నిర్మల్ రూరల్: డీఎస్సీ–2024లో నియమితులైన ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 3 దశల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు శిక్షణ అందించనున్నారు. నూతనంగా నియమితులైన ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలకు శిక్షణ అందించనున్నారు.
మూడు రోజులు తరగతులు..
ఎస్టీటీ ఉపాధ్యాయులకు ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు మార్చి 4, 5, 6 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, పీఈటీలకు మార్చి 10, 11, 12 తేదీల్లో హైదరాబాదులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు శిక్షణ ఇచ్చేందుకు డీఆర్పీలను విద్యాశాఖ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
శిక్షణ అంశాలు ఇవీ..
ఉపాధ్యాయులకు వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాల సద్వినియోగం, తరగతిగది నిర్వహణ, విద్య అభ్యసన ప్రమాణాల పెంపు, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, విధానాలు, ఐసీటీ, ఐఎఫ్‌ఎస్సీ, బోధన, తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను పగడ్బందీగా అమలు తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి వచ్చిన శిక్షకులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ప్రతీరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. మధ్యాహ్న భోజనం అందజేస్తారు.
నిధులు విడుదల..
జిల్లాలో 2024 డీఎస్సీ ద్వారా మొత్తం 288 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఇందులో అత్యధికంగా ఎస్జీటీలు 204 మంది ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లు 57, భాషా పండితులు 03, పీఈటీలు 04 మంది నియామకమయ్యారు. అయితే శుక్రవారం నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయునికి రూ.775 చొప్పున మొత్తం జిల్లాకు రూ.2.23 లక్షలు కేటాయించారు. అదేవిధంగా ఒక్కో కేంద్రానికి అదనంగా రూ.వెయ్యి విడుదలయ్యాయి. ఒక్కో శిక్షణ కేంద్రంలో గరిష్టంగా 40 నుంచి 45 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు అందించే శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి. తరగతుల్లో విద్యార్థులకు బోధించే విధానాన్ని విద్యార్థులతో అవలంబించాల్సిన పద్ధతులను శిక్షకులు నేర్పిస్తారు. డిజిటల్ బోధన, అభ్యసన ప్రమాణాల పెంపు, ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, అవలంబించాల్సిన విధానాలపై వివరిస్తారు. కొత్త ఉపాధ్యాయులకు ఈ శిక్షణ తరగతులు ఎంతో వరం లాంటివి. విద్యార్థుల్లో విద్య ప్రమాణాల పెంపునకు దోహదం చేస్తాయి. – రామారావు, డీఈవో
శిక్షణ పొందే ఉపాధ్యాయుల వివరాలు
భాషా పండితులు 03
పీఈటీలు 04
ఎస్జీటీలు 204
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 20
స్కూల్ అసిస్టెంట్‌లు 57
మొత్తం 288
కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment