ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కుతూ కిందపడి తండ్రి, కూతురు మృతిచెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన రాంచందర్‌రావు(40) కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి దేవి దర్శనం కోసం పర్బణి ఎక్స్‌ప్రెస్‌లో బాసరకు సీట్లు రిజర్వేషన్ చేసుకున్నారు.
రైలులో ఎస్–8 బోగీలో రెండు సీట్లు రాంచందర్‌రావు కూతుళ్లకు రిజర్వ్ కాగా, ఎస్–4 రాంచందర్‌రావు దంపతులకు రిజర్వ్ అయ్యాయి. వీరు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకున్నారు. నిజామాబాద్‌లో ఇతర ప్రయాణికులు దిగిపోవడంతో రాంచందర్‌రావు కూతుళ్లకు ఫోన్ చేసి తమ దగ్గర సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు.
అనంతరం వారిని తీసుకుని తామున్న బోగీలోకి ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా పెద్ద కూతురును బోగీలోకి ఎక్కించిన అనంతరం చిన్నకూతురు(14)ను ఎక్కిస్తుండగా రైలు కదలడంతో చిన్నకూతురు రైలుకింద పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో తండ్రికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. రాంచందర్‌రావు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రాంచందర్‌రావు బంధువు వేముల మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని రైల్వే ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment