TS Nizamabad Assembly Constituency: ఎమ్మెల్సీ కవిత 'వర్సెస్‌' ఎంపీ అర్వింద్‌.. మాటల యుద్ధం కాస్త ఫ్లెక్సీల వార్‌ దాకా..
Sakshi News home page

ఎమ్మెల్సీ కవిత 'వర్సెస్‌' ఎంపీ అర్వింద్‌.. మాటల యుద్ధం కాస్త ఫ్లెక్సీల వార్‌ దాకా..

Published Fri, Oct 27 2023 1:06 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: 'ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అర్వింద్‌ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్‌ను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత వ్యాఖ్యానించారు. కేటీఆర్‌, కవిత కారణంగానే బీఆర్‌ఎస్‌ ఓడనుందని ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్‌ చేసేందుకు కవిత స్కెచ్‌ వేశారని ఆరోపించారు.'

శాసనసభ ఎన్నికల ప్రచారం స్పీడందుకుంటున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నువ్వా నేనా అనే విధంగా నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పార్లమెంట్‌ ఎన్నిక ల్లో కవితపై అర్వింద్‌ విజయం సాధించినప్పటి నుంచీ ఈపోరు నడుస్తూనే వస్తోంది. పసుపు బోర్డు అంశంపై అర్వింద్‌, కవితతోపాటు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం పోటాపోటీ మాటలతో పాటు ఫ్లెక్సీల వార్‌కు దిగారు.

మీరొక ఫ్లెక్సీ పెడితే మేము పది ఫ్లెక్సీలు పెడతాం అన్న రీతిలో ఈ వార్‌ నడిచింది. మాటల యుద్ధం మాత్రం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇది రానురాను మరింత పెరుగుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్‌ను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత తాజాగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో తిరిగి బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడిస్తామన్నారు.

మరోవైపు అర్వింద్‌ మాత్రం బీఆర్‌ఎస్‌పై మాటల దాడిని తీవ్రతరం చేశారు. కవిత ప్రచారం చేస్తే బీజేపీకి మరింత మెజారిటీ వస్తుందని అర్వింద్‌ అన్నారు. బీఆర్‌స్‌కు కార్యకర్తలే ఓట్లు వేయరన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్‌ చేసేందుకు కవిత స్కెచ్‌ వేశారన్నారు. కేటీఆర్‌, కవిత కారణంగానే బీఆర్‌ఎస్‌ ఓడనుందన్నారు. అభద్రతా భావంతో ఉన్న బీఆర్‌ఎస్‌ హిందువులను కులాల వారీగా విభజిస్తోందన్నారు. ఎక్కడా గెలవలేని కవిత ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారన్నారు. అలాంటి కవిత వేరేవాళ్లను ఎలా గెలిపిస్తుందని అర్వింద్‌ అన్నారు.

పైడి అంటే ఫ్లవర్‌ కాదు.. ఫైర్‌..
ఆర్మూర్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. కులసంఘాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి మాత్రం జీవన్‌రెడ్డిపై మాటల దాడి చేస్తున్నారు. పైడి అంటే ఫ్లవర్‌ కాదు.. ఫైర్‌ అని చెబుతున్నారు. జీవన్‌రెడ్డి సర్పంచ్‌లను బెదిరించినట్లు నన్ను బెదిరించాలంటే సాధ్యం కాదన్నారు.

తాను గెలిస్తే జీవన్‌ మాల్‌ లీజ్‌ను రద్దు చేస్తానని చెబుతున్నారు. ఫాంహౌజ్‌, పైరవీల ధ్యాస జీవన్‌రెడ్డిదన్నారు. ఆర్మూర్‌ అంబేద్కర్‌ సెంటర్‌లో లైవ్‌ చర్చకు రావాలని రాకేష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆస్తుల చిట్టా బహిర్గతం చేసుకుందామన్నారు. ఎవరేమిటో తేల్చుకుందామన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌లో బీఆర్‌ఎస్‌ అ భ్యర్థి గణేష్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ సైతం మెల్లగా మాటల దాడి పెంచుతున్నారు.
ఇవి చదవండి: 'ఓటు' ను కొన్ని సమయాల్లో వేరే పేర్లతో పిలుస్తారు.. అవేంటో తెలుసా..!?

Advertisement
 
Advertisement
 
Advertisement