పాత కక్షలతో గొర్రెల కాపరి హత్య
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు!
నిజామాబాద్: పాత కక్షల నేపథ్యంలో ఓ గొర్రెల కాపరి హత్యకు గురయ్యాడు. ఓ మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా హత్య ఉదంతం వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన జీర్ల చిన్న మల్లయ్య(52) గొర్రెలను కాస్తు జీవనం సాగిస్తున్నాడు.
వారం క్రితం నుంచి అతడు కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 19న మిస్సింగ్ కేసు నమోదైంది. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అతడిని హత్య చేసినట్లు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది.
కుమారుడి ఆత్మహత్యతో..
మల్లయ్య కుమారుడు ప్రవీణ్(22) రెండు నెలల క్రితం గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఆత్మహత్యకు కారణం అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులేనని అనుమానం వ్యక్తం చేస్తూ మల్లయ్య పలుసార్లు వారితో వాగ్వాదానికి దిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
దీంతో వారి మధ్య కక్షలు పెరిగాయని భావిస్తున్నారు. గాయత్రి షుగర్ ఫ్యాక్టరి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా మల్లయ్య అదృశ్యమైన రోజు గొర్రెలను మిషన్ భగీరథ ప్లాంటు సమీపంలోని ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్తుండగా అతడిని సదరు ఇద్దరు యువకులు అనుసరించినట్లు రికార్డు అయింది. కాల్ డేటా ఆధారంగా మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది.
మల్లయ్యను నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి అక్కడే గోతి తీసి పాతి పెట్టినట్లు తెలుస్తోంది. సోమవారం రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని గుర్తించే పని వాయిదా పడినట్లు సమాచారం. పోలీసులు మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment