దిగ్విజయంగా ముగిసిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు | 8th World Telugu Literary Conference great success | Sakshi
Sakshi News home page

దిగ్విజయంగా ముగిసిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

Published Thu, Oct 6 2022 2:50 PM | Last Updated on Thu, Oct 6 2022 3:34 PM

8th World Telugu Literary Conference great success - Sakshi

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్ థియేటర్స్ భారతదేశం, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు తల్లి కెనడా, సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  “8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" 3వ రోజు కార్యక్రమం, అక్టోబర్ 2, 2022, ఆదివారం అంతర్జాలం ద్వారా 14 గంటల  పాటు దిగ్విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటులు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొనగా, పారిస్ నుండి డా. డేనియల్ నేజర్స్ సదస్సు సమాపన సమావేశంలో పాల్గొని స్వచ్ఛమైన తెలుగులో ప్రసంగించారు. అంతకు ముందు సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో మొదటి రెందు రోజుల సాహిత్య ప్రసంగాలూ న్యూజీలాండ్ లో ప్రత్యక్ష వేదిక, అలాగే అంతర్జాలంలోనూ 24 గంటలు నిర్విరామంగా జరిగిన సంగతి తెలిసినదే. 

సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, రాధాకృష్ణ గణేశ్న ప్రధాన సాంకేతిక నిర్వాహకులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ నాటి సదస్సులో సుమారు 75 మంది భారతదేశ వక్తలు తమ వైవిధ్యభరితమైన సాహిత్య ప్రసంగాలను అందించారు.

రాధిక మంగిపూడి (ముంబై), సుబ్బు పాలకుర్తి (సింగపూర్), గౌతమ్ లింగా (జొహానెస్ బర్గ్), జయ పీసపాటి (హాంగ్ కాంగ్), రాధిక నోరి (అమెరికా), శ్రీసుధ (ఖతర్) ఈ సదస్సులోని ఆరు వేదికలను సమర్థవంతంగా నిర్వహించగా డా. ఎస్ ఆర్ ఎస్ కొల్లూరి(అమలాపురం) నిర్వహణలో ఒక ప్రత్యేక కవి సమ్మేళన వేదిక, కథా పఠనాలు, శారద కాశీవజ్ఝల (అమెరికా) నిర్వహణలో సాహిత్యం క్విజ్ మొదలైన ఆసక్తికరమైన అంశాలతో ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. ‘వసంతవల్లరి’ అయ్యగారి వసంతలక్ష్మి గళంలో “వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన అమెరికామెడీ కథలు” ఆడియో పుస్తకాన్ని తనికెళ్ళ భరణి ఆవిష్కరించగా, “డయాస్పోరా తెలుగు కథ, సాహిత్యం అంటే ఏమిటి?” అనే వ్యాస సంకలనాన్ని సంపాదకులు వంగూరి చిట్టెన్ రాజు పరిచయం చేశారు. వంశీ రామరాజు, రామ చంద్రమౌళి, గంటి భానుమతి, చిత్తర్వు మధు మొదలయిన లబ్ఢప్రతిష్టులు, సిలిలిక, అనఘ దత్త మొదలయిన చిన్నారుల ప్రసంగాలతో సదస్సు ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.

ముగింపు వేదికలో మూడు రోజుల సదస్సు విశేషాలను సమీక్షిస్తూ సుమారు 25 దేశవిదేశాల వక్తలకీ, 18 మంది వేదిక నిర్వాహకులకీ, 30 మంది సాంకేతిక నిర్వాహకులకీ, ఆర్ధిక సహకారం అందజేసిన దాతలకీ, మీడియా ప్రతినిధులకీ నిర్వాహకులు తమ ధన్యవాదాలు తెలిపారు. 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం సభ్యులు కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు. 

అలాగే వచ్చే ఏడాది జూన్ 22, 23, 24 తేదీలలో ఫ్రాన్స్ లోని పారిస్ మహా నగరంలో INALCO University ఆధ్వర్యంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తదితరుల సహకారంతో తెలుగు భాష, సాహిత్యం, కళా రూపాలు, జానపదాలని ఫ్రాన్స్ దేశవాసులకి పరిచయం చేయడానికి ఒక సమగ్రమైన కార్యక్రమానికి రూప జరుగుతోంది ఆ సాంస్కృతిక కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం అనీ ప్రొఫెసర్ డేనియల్ నెజెర్స్ (యూనివర్శిటీ ఆఫ్ పారిస్), వంగూరి చిట్టెన్ రాజు తమ సంయుక్త ప్రకటనలో తెలియ జేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement