పసిపిల్లలు దేవుళ్లతో సమానంగా పోలుస్తారు. ఎందుకంటే వాళ్లు కళ్లకపటం ఎరుగరని, అభం శుభం తెలియదని. అయితే ‘వీరు’ శారీరకంగా పెద్దవారే అయినా మానసికంగా పిల్లలే. వీళ్లకి మోసాలు తెలియవు, అమయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. కానీ వీళ్ల మంచి చెడ్డలు చూడాలన్నా,.. వీరి జీవితంలో మార్పు తేవాలన్నా ఎవరికైనా కత్తి మీద సామే. ఎంతో పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అలాంటి వారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఓ ఎన్నారై డాక్టర్ చేస్తోన్న నిర్విరామ ప్రయత్నం...
- కాజీపేటకు చెందిన లిఖిత్‌ని ఇంతకు ముందు ఎవరైనా ఏమన్నా అంటే చాలు.. ముందు వెనుక చూడకుండా చేతిలో ఏది ఉంటే దాంతో ఎదుటివారిపై చేసేవాడు. బంధువులు ఏదోమాట అన్నారని విలువైన బంగారు వస్తువులు బయటపడేశారు. ఈ పిల్లాడి భవిష్యత్తు ఏంటని ఆ బిడ్డ తల్లి బెంగపెట్టుకోని రోజు లేదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఐదేళ్లలో లిఖిత్‌లో ఎంతో మార్పు. ఎవ్వరినీ ఏమనడం లేదు. ఏ వస్తువు పడేయడం లేదు. ఇప్పుడా తల్లి నిశ్చింతగా పని చేసుకుంటోంది.
- వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పోషాలు, హైమలది రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. వాళ్లకి ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు తమకేం కావాలో చెప్పలేని స్థితిలో ఉన్నారు. పదేళ్లు దాటినా తల్లిదండ్రులు పక్కన లేకుంటే పక్క తడిపేస్తారు. అందుకే పని మానుకుని హైమ ఇంటి పట్టునే ఉండిపోయింది. ఒక్కడి కష్టంతో ఐదుగురి కడుపు నిండటం కష్టంగా ఉండేది ఒకప్పుడు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు పిల్లలు పక్క తడపడం లేదు. తల్లిదండ్రులు బయట పనులకు వెళ్తున్నారు. పిల్లలకు కడుపు నిండా తిండి పెడుతున్నారు.
రెండు వేర్వేరు కుటుంబాలు, వేర్వేరు పరిస్థితులు. కానీ కష్టాలు ఒకే రకం. తమ పని తాము చేసుకోలేని పిల్లలు, తమకేం కావాలో కూడా తెలియని అమాయకులు. ఇతరులపైనే ఆధారపడ్డ బతుకులు ఒకప్పుడు వాళ్లవి. కానీ ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్న వందల మంది పిల్లల జీవితంలో వెలుగు నింపేందుకు ఒక్కడొచ్చాడు అమెరికా నుంచి. అక్కడ క్షణం తీరిక లేకుండా రెండు ఆస్పత్రుల్లో చేస్తున్న డాక్టరు ఉద్యోగాన్ని వదులుకుని, ఎంతోమంది కలలుగనే డాలర్ల మూటలు పక్కన పెట్టి ఇండియాకి వచ్చేశాడు. తల్లిదండ్రులకిచ్చిన మాట కోసం, ఒకప్పుడు తనకు అండగా నిలిచిన పిల్లల కోసం. అతనే డాక్టర్ వీరమల్ల చరణ్‌జిత్‌రెడ్డి, అతను నెలకొల్పిందే వరంగల్‌లోని బన్ను ఆరోగ్యదా సేవా సోసైటీ. అందులోని ఓ విభాగమే బన్ను న్యూరోహెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్.
వాళ్లకు ప్రత్యేకం
దివ్యాంగులతో పోల్చితే ఇంటెలెక్చువల్ డిసెబులిటీ (మానసిక వికలాంగుల) పరిస్థితి మరీ దయనీయం. ఆకలేసినా చెప్పలేరు, కనీసం ‘ఒకటికి’ వచ్చినా నోరు విప్పరు. ఒంటికి మీదికి ఏళ్లు వచ్చినా ఇంకా చంటిబిడ్డల్లాంటి ప్రవర్తనే. తల్లిదండ్రులో మరొకరరో తోడుగా లేకుండా బతకలేని పరిస్థితి. పైగా ఎమోషన్స్ అదుపుతప్పి తల్లిదండ్రులు, ఎదుటి వారిపై దాడి చేసే స్వభావం కూడా వీరిలో ఎక్కువే. ఇలాంటి వారి కోసం అనేక స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చినా... అవన్నీ ఆశ్రయం ఇవ్వడం, సమయానికి తిండి అందివ్వడం పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. కానీ ‘బన్ను’ ఇందుకు భిన్నం. తమకు తామే కాకుండా ఇతరులకు భారంగా మారిన పిల్లలకు బతుకు భరోసాను అందిస్తోంది. ప్రతీ పనికి ఇతరులపై ఆధారపడే పిల్లలకీ సొంతంగా బతికే తెలివితేటలు, నైపుణ్యాలను అందిస్తోంది. తమ పిల్లలు కూడా అందరిలాగే ఉంటే బాగుండు అనుకుని వివిధ ‘సెంటర్ల’ చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు ఇప్పుడు బన్ను రూపంలో ఓ నమ్మకం కనిపిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత పిల్లలు వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్న అనుభవాలే ఇందుకు ఉదాహరణ.
ఆ కష్టాలు అప్పుడే తెలిశాయి
ఇండియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత పీజీ కోసం చరణ్‌జిత్‌రెడ్డి అమెరికా వెళ్లారు. అక్కడ పీజీలో సీటు సాధించేందుకు రెండేళ్ల సమయం పట్టింది. ఈలోగా ఖర్చుల కోసమని న్యూజెర్సీ దగ్గర్లో ఉన్న బ్యాన్‌క్రాఫ్ట్ న్యూరోహెల్త్ సెంటర్ అనే మానసిక వికలాంగుల కేంద్రంలో పార్ట్‌టైం జాబ్‌లో చేరారు. అప్పుడే మానసిక వికలాంగుల కష్టాలను, వారి ప్రత్యేక అవసరాలను దగ్గరగా చూశారు. వాళ్లకి సేవలు చేశారు. అందుకు ప్రతిఫలంగా వచ్చిన డబ్బుతోనే మెడిసిన్‌లో పీజీ చేశారు. ఆ పట్టాతోనే అమెరికాలో ఉద్యోగం పొందారు. అయితే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే మానసిక వికలాంగుల పరిస్థితి ఇలా ఉంటే ఇండియాలో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటనే బాధ ఆయన్ని కలచివేసింది. అందుకే అక్కడ డాక్టరుగా కొంత డబ్బులు కూడబెట్టిన తర్వాత వరంగల్‌లో పూర్తి ప్రొఫెషనల్‌గా బన్ను న్యూరో హెల్త్ సెంటర్, రిహాబిలిటేషన్ సెంటర్‌ని నెలకొల్పారు. ఆశ్రయం, తిండి ఇస్తే సరిపొదని... ఎవ్వరి అవసరం లేకుండా మానసిక వికాలంగులు బతికేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా పూర్తి ప్రొఫెషనల్‌గా దీన్ని తీర్చి దిద్దారు. అందువల్లే ప్రారంభంలో 8 మంది విద్యార్థులే ఉన్నా 15 మంది ప్రొఫెషనల్ స్టాఫ్‌ని నియమించారు. ప్రస్తుతం ఇక్కడ 200ల మందికి పైగా విద్యార్థులు 34 మంది స్టాఫ్‌తో ఈ న్యూరోహెల్త్ సెంటర్ పని చేస్తోంది. .
హెల్త్ సెక్టార్‌లో
బన్ను న్యూరో హెల్త్ సెంటర్‌తో పాటు ఏటూరునాగారంలో బన్ను ఛారిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించారు. వరంగల్‌కి వంద కిలోమీటర్ల దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండే ఈ ఏరియా ప్రజలకి అతి తక్కువ ధరలకే వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఛారిటీ పనులయినా సరే నాణ్యతతో రాజీ పడపలేదు. ఆపరేషన్ థియేటర్, సర్జన్ , ఎక్విప్‌డ్ ల్యాబ్‌ల సాయంతో నాణ్యతతో కూడి వైద్య సేవలు ఏజెన్సీ ప్రాంతంలో అందిస్తున్నారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు వీలుగా సిబ్బందికి ఆకర్షణీయమైన వేతనం అందిస్తున్నారు. తాజాగా ములుగు జిల్లాలో ఉచితంగా అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు.
జీవితాల్లో వెలుగు
బన్ను హెల్త్‌కేర్ ట్రస్ట్ కారణంగా ఈ రోజు ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారంలో అత్యవసర వైద్య సేవలు అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. రెండు వందల మందికి పైగా మానసిక వికలాంగులు ఇప్పుడు తమ పనులు తాము చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులు వివిధ పనులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇరుగుపొరుగు సూటిపోటీ మాటలతో మనసు కష్టపెట్టుకున్న ఎంతో మంది తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లల మీద భరోసాతో ఉంటున్నారు.
ఇక నుంచి
బన్ను ఛారిటీ ఆస్పత్రి, బన్ను న్యూరోహెల్త్‌సెంటర్, బన్ను అంబులెన్స్ సేవలు విజయవంతంగా సేవలు అందించే వరకు అమెరికాలో ఆస్పత్రుల్లో పని చేస్తూ తన జీతం డబ్బులతో వీటికి ఫండింగ్ చేశారు. ‘బన్ను’ సంస్థలు నిలదొక్కునేంత నిధులు సమకూర్చిన తర్వాత వాటిని దగ్గరుండి నడిపించేందుకు అమెరికా నుంచి ఇండియా వచ్చేశారు. రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా ఆయన ముందుకు కదులుతున్నారు.
అమ్మానాన్నల వల్లే - చరణ్‌జిత్ రెడ్డి
‘మా అమ్మకి డాక్టరై సమాజానికి తన వంతు సాయం చేయాలనే ఆశయం ఉండేది, కానీ రక్తం చూస్తే కళ్లు తిరిగి పడిపోయే హిమోఫోబియా కారణంగా మెడిసిన్ మధ్యలో వదిలేసింది. మా నాన్న సాయిరెడ్డిది స్థితిమంతుల కుటుంబమే అయినా.. ఆరేళ్లు వచ్చేప్పటికి తల్లిదండ్రుల్నీ కోల్పోయాడు. దీంతో ఆస్తులున్నా నాన్న వారాలు చేసుకుని చదువుకుని ఇంజనీర్‌గా సెటిలయ్యారు. తన ఎదుగుదలలో కుటుంబం కంటే సమాజమే ఎక్కువ అండగా నిలిచిందని, తిరిగి సోసైటీకి ఏదైనా చేయాలంటూ ఆయన ఎప్పుడు చెబుతుండే వారు. వారిద్దరి ప్రభావం వల్లనే మా అమ్మ పద్మజ ముద్దు పేరైన బన్ను పేరు మీదుగానే హెల్త్ సెక్టార్‌లో సేవా కార్యక్రమాలను చేపడుతున్నాను.
- సాక్షి, వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment