ఐసీఐసీఐ బ్యాంకు అధికారి బారిన పడి ఎన్‌ఆర్‌ఐ మహిళ పెద్దమొత్తంలో డబ్బును కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా మేనేజర్ నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయలను కొట్టేశాడు. మరొక బ్యాంక్ ఉద్యోగి తన డబ్బులపై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేయడంతో, తన సొమ్ముకోసం ఆరా తీసిన నేపథ్యంలో ఈ స్కామ్ బయటపడింది.
బీబీసీ కథనంప్రకారం ఎన్‌ఆర్‌ఐ శ్వేతా శర్మ 2016లో భారత్‌కు తిరిగి వచ్చింది. అమెరికాలో డిపాజిట్లపై వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఇండియాలో సొమ్మును డిపాజిట్ చేయాలని నిర్ణయించుకుంది. పాత గురుగ్రామ్‌లోని బ్యాంకు బ్రాంచ్‌ని సందర్శించిన తర్వాత బ్యాంక్ అధికారి సలహా మేరకు శ్వేతా శర్మ 2019లో ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన NRE ఖాతాను తెరిచింది. 5.5-6 శాతం వడ్డీ రేటుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది 2019,సెప్టెంబర్-2023 డిసెంబర్ 2023 మధ్య నాలుగేళ్ల వ్యవధిలో తమ సేవింగ్స్ దాదాపు రూ13.5 కోట్లను డిపాజిట్ చేసింది. వడ్డీతో కలిపి ఈ మొత్తం విలువ రూ. 16 కోట్లు ఉంటుందని శ్వేతా చెబుతున్నారు.
స్నేహితురాలి ద్వారా తనకు పరిచయమైన బ్యాంకు అధికారి మోసపూరితంగా తనకు ఫేక్ స్టేట్‌మెంట్లు ఇచ్చాడని పేర్కొంది. ఫేక్ ఈమెయిల్ ఐడీని సృష్టించి, బ్యాంకు రికార్డుల్లో తనమొబైల్ నంబర్‌ను మార్చేసి, మెసానికి పాల్పడ్డాడని వాపోయింది. భారత్‌లో ఎఫ్‌డీల్లో పెట్టుబడులు పెట్టమని మోసపూరితంగానే ఒప్పించాడని, నకిలీ ఖాతాలు సృష్టించి, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, డెబిట్ కార్డులు, చెక్ బుక్‌లను తన (బ్యాంకు అధికారి) పేరు మీద తీసుకున్నాడని ఆరోపించింది. అందుకే బ్యాంకు నుంచి తనకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని తెలిపింది. అలాగే డిపాజిట్‌లలో ఒకదానిపై రూ.2.5 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకున్నాడని తన దృష్టికి వచ్చిందని కూడా వెల్లడించింది. బ్యాంక్ ప్రతినిధి కూడా మోసాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది.
అయితే దీనిపై స్పందించిన ఐసీఐసీఐ బ్యాంకు గత మూడేళ్లు బాధితురాలి ఖాతాలో జరిగిన ఈ లావాదేవీలు బ్యాలెన్స్‌ల గురించి కస్టమర్ తనకు తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించింది.ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేసేటప్పుడు అయినా ఆమె ఈ వ్యత్యాసాన్ని గమనించి ఉండాల్సిందని పేర్కొంది. అయినా దర్యాప్తు ఫలితాలను బట్టి, తాత్కాలికంగా ఆమె ఖాతాలో రూ.9.27 కోట్లు జమ చేశామని బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపింది. రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు హామీ ఇచ్చినప్పటికీ ఫిర్యాదు చేసి ఆరు వారాలకు పైగా గడిచిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment