US: యూఎస్‌లో అసలైన అమెరికన్‌లు ఎంతమందంటే..! | Why Was America A Colony And Its History | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో అసలైన అమెరికన్‌లు ఎంతమందంటే..!

Published Fri, Mar 29 2024 1:29 PM | Last Updated on Fri, Mar 29 2024 5:18 PM

Why Was America A Colony And Its History - Sakshi

వలస వాదుల దేశం అమెరికా

వేర్వేరు దేశాల నుంచి అమెరికాకు

జులై 4 1776న అమెరికాకు స్వాతంత్రం

ఇప్పుడు అమెరికా జనాభా 33.5 కోట్లు

శ్వేత జాతీయుల జనాభా 25 కోట్లు (71%)

హిస్పానిక్‌ 4.5 కోట్లు (18%)

నల్లజాతి ప్రజలు 4 కోట్లు (12% )

భారతీయులు, ఏషియన్లు 2 కోట్లు (6%)

భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అవడంతో, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అందరికీ ఉపాధి కల్పించడం, నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వానికైనా సవాలు లాంటిదే. అందుకే బతుకు దెరువు వెతుక్కుంటూ అటు అరబ్బు దేశాలకో, ఇటు చదువుల పేర అమెరికా లాంటి దేశాలకో వెళ్లడం ఇప్పుడు మన యువతకు తప్పడంలేదు.

మనదే మనదే మనదే.. ఈ ప్రపంచమంతా మనదే
శక్తి యుక్తి సామర్థ్యాలకు.. సరిహద్దులతో పనిలే

కష్టపడి పనిచేసే వారిని.. కాదనువారు లేరులే
విశ్వాసంతో ముందుకు వెళితే.. అపజయమన్నది లేదులే

గడప దాటితే ఒంటరివెట్లా.. బాటసారులే బంధుమిత్రులు
కలిసి నడిస్తే మాట కలిపితే.. ప్రపంచమంతా మనదేలే !

మన NRIలను ఉద్దేశించి నేను రాసిన ‘వలస పక్షులు ’ అన్న ఒక చిన్న కవితలో. అయితే బయటి దేశాలు ఏవైనా వాళ్ళ అవసరాలను బట్టే విదేశీయులను అనుమతిస్తాయి, అందులో కూడా పైకి ఎన్ని చెప్పినా అంతరాంతరాల్లో కొంత వివక్ష ఉండనే ఉంటుంది. ఒక విధంగా చూస్తే అమెరికా పూర్తిగా వలసవాదుల దేశం. ఆ దేశ జనాభాలో నిజమైన భూమిపుత్రుల సంఖ్య నామమాత్రమే. చరిత్రలోకి వెళితే ఆ దేశంలో కొలంబస్ అడుగు పెట్టింది 1492 లో. అలా అమెరికా కు వచ్చిన సెటిలర్స్ రెడ్ ఇండియన్స్ను పూర్తిగా తొక్కిపెట్టి అక్కడి పాలకులయ్యారు. బ్రిటిష్ వారి నుంచి వారు స్వాతంత్య్రం ప్రకటించుకున్నది 1776 జులై 4 న. ఆఫ్రికా దేశాల నుంచి బానిసలుగా తెచ్చుకున్న నల్లవారి శ్రమశక్తితో వారు తమ వ్యవసాయాన్ని వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నది నిజం.

ఆలస్యంగా నైనా తమ తప్పిదాన్ని గ్రహించి, బానిసత్వాన్ని నిషేధించి అమెరికా నాగరిక దేశం అనిపించుకున్నది 1807 లో మాత్రమే. కాని బానిస వ్యాపారం ఆ దేశంలో అంత సులభంగా పోలేదు, అదో అంతర్యుద్దానికి దారి తీసింది. అబ్రహం లింకన్ ఆ దేశాధ్యక్షుడు అయినాకనే ( 1860) అక్కడి జాత్యహంకారులపై విజయం సాధ్యమైంది. అదీ ఆ మహానుభావుని ప్రాణత్యాగంతో. ఎలాగైతేనేం అలా వచ్చిన వలసవాదులు, వారిచే బానిసలుగా తీసుకు రాబడ్డవారు, బతుకుదెరువు కోసం వచ్చినవారు అంతా కలిసి ఆ దేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళే మా దేశంలోకి అక్రమ వలసలు పెరిగిపోతున్నాయని బాధపడిపోవడం విశేషం. పక్కనే వున్న మెక్సికో లాంటి దేశాల నుండి చాలామంది దొంగచాటుగా ప్రాణాలకు తెగించి వచ్చి అమెరికాలో ఏ పని దొరికితే ఆ పని చేసుకొని బతుకుతున్నారు.

 నిర్మాణ రంగంలో, పారిశుద్ధ్య పనుల్లో, ఇంటి పనుల్లో అన్నింట్లో వాళ్ళే కనిపిస్తారు. తక్కువ వేతనం మీద ఎక్కువ శ్రమ చేస్తున్న వీరు ఒక్క రోజు పని మానేస్తే అక్కడి నగరాలు చెత్త కుప్పల్లా కనబడుతాయి మరి. కానీ ఇలాంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రాంట్స్ ను కట్టడి చేయాలని, అమెరికాలో పుట్టినంతమాత్రానే వాళ్లకు పౌరసత్వం ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు కొన్ని. చైనా, పాకిస్థాన్, ఇండియా వంటి దేశాల నుంచి కూడా అక్రమ వలసలు పెరుగుతున్నాయంటారు. మన గుజరాతీలు, పంజాబీలు, దక్షిణాది రాష్ట్రాల వారు కూడా వ్యాపార రంగాల్లో బాగా స్థిరపడ్డారు. సాఫ్ట్‌వేర్ పుణ్యమా! అని ఇప్పుడు యూఎస్ లోని ఏ సిటీకి వెళ్లినా కనబడే NRIల్లో తెలుగు వారే ఎక్కువ, మంచి కమ్యూనిటీల్లో ఉంటున్నది కూడా మన వాళ్లే, ఎక్కువ కష్టపడే వాళ్లు కూడా మనవాళ్లే. సెలవులు, వీకెండ్‌లను కూడా త్యాగం చేసి శ్రమిస్తూనే కనిపిస్తారు.

ఇక్కడికి చదువుల కోసమని వస్తున్న మన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇక్కడ ఉన్నత విద్య చాలా ఖర్చుతో కూడుకున్న పని అవడంతో, జేబు ఖర్చులకోసం మన పిల్లలు చిన్న చిన్న పనుల్లో కనబడుతున్నారు. వీటికి తోడు ఇటీవలి కాలంలో మనవారి గుళ్ళు గోపురాల హడావిడి ఎక్కువవడంతో దీన్ని కొందరు గిట్టనివారు చేస్తున్న దుష్ప్రచారం వల్ల భారత సంతతి వారిపై కొంత ఈర్ష్యాద్వేష భావాలు పెరుగుతున్న వార్తా సంకేతాలు. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా అమెరికాలో కూడా పేదరికం ఉంది, అక్కడక్కడ అడుక్కుతినేవాళ్ళు కనబడతారు.

ఇండియాలో ఉన్నా అమెరికా వెళ్లినా ప్రతినిత్యం నేను విధిగా చేస్తున్నది మార్నింగ్ వాక్. అలా అమెరికాలో నేను బయటికి వెళ్తున్నప్పుడల్లా మా అమ్మాయి పర్సులో డబ్బులున్నాయా డాడీ ! అని అడిగేది. నేను షాపింగ్‌కు వెళ్లడం లేదు కదా! అంటే ‘అలా కాదు, కనీస మొత్తం డాలర్లైనా దగ్గరుండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆకస్మాత్తుగా ఎవరైనా మగ్గర్స్ వచ్చి అడిగితే ఎదురు చెప్పకుండా వాళ్లకు ఉన్నవి ఇచ్చేయడం మంచిది. ఇక్కడ గన్ కల్చర్ ఎక్కువ జాగ్రత్త ! ’ అని హెచ్చరించేది!.  నాకు మాత్రం అలా ఎప్పుడూ జరగలేదు, ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఆడా మగా అనకుండా వాకింగ్‌లో చిరునవ్వుతో ‘ హాయ్ ’ అని చెప్పడం నన్ను ముగ్దుణ్ణి చేసిన విషయం !

వేముల ప్రభాకర్‌

(చదవండి: అమెరికా లైబ్రరీ ఇంత బాగుంటుందా! అందులోనే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement