చిల్లకల్లు వద్ద లారీని ఢీకొట్టిన టీఎస్ ఆర్టీసీ బస్సు
చిల్లకల్లు(జగ్గయ్యపేట): లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరు తీవ్రంగా మరో 23 మంది స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజాము ఐదు గంటల సమయంలో జరిగింది. తెలంగాణకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన 37 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరింది.
ఈ క్రమంలో గ్రామంలోని ఫ్లైఓవర్‌పై నుంచి కిందకు దిగుతున్న బస్సు అదే సమయంలో గ్రామంలోని సర్వీస్ రోడ్డు నుంచి 65వ నంబరు జాతీయ రహదారి ఎక్కేందుకు వస్తున్న లారీని పెట్రోల్ బంకు సమీపంలో వెనుకగా ఢీకొట్టింది. ఈ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. లారీని బస్సు ఢీకొన్న సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడి భయంతో ఆర్తనాదాలు చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న సమీపంలోని జీఎంఆర్ టోల్‌ప్లాజా సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.
పోలీసులు కూడా వచ్చి టోల్‌ప్లాజా సిబ్బందితో కలిసి ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీసుకువచ్చారు. డ్రైవర్ తన్నీరు లక్ష్మీనారాయణ తన సీటులో ఇరుక్కుపోవటంతో బయటకు తీసేందుకు పోలీసులు రెండు గంటల పాటు శ్రమించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రెండు కాళ్లు విరిగాయి.
బస్సులో ప్రయాణిస్తున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్.అన్నవరానికి చెందిన కొనిశెట్టి లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమించటంతో విజయవాడ తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం లేకపోవటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉదయభాను చొరవతో అంబులెన్స్‌లు ఏర్పాటు
ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయించి గాయపడిన 24 మందిని జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వాస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కట్టా వీరబాబు వైద్యులతో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తు కారణమని అధికారులు అంటున్నారు. ఘటనా స్థలాన్ని విజయవాడ డీసీపీ అజిత, ఏసీపీ జనార్దన్ నాయుడు, సీఐ జానకిరామ్, ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తదితరులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment