ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌... | - | Sakshi
Sakshi News home page

ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌...

Published Mon, Oct 9 2023 3:02 AM | Last Updated on Tue, Oct 10 2023 11:57 AM

- - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు 45 ఏళ్లు నిండిన వారిలో కనిపించే బ్రెస్ట్‌ క్యాన్సర్‌, ఇప్పుడు యుక్త వయస్సు వారిలో కూడా గుర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రొమ్ము క్యాన్సర్‌ను వైద్యుడి వద్దకు వెళ్లకుండానే సెల్ఫ్‌ చెక్‌ చేసుకోవడం ద్వారా గుర్తించే అవకాశం ఉన్నా, చాలా మంది రెండు, మూడు దశల వరకూ గుర్తించలేక పోతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కొంత వరకూ సత్ఫలితాలు ఇస్తున్నా, ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

పాశ్చాత్య దేశాల్లో 50 ఏళ్లు దాటిన వారిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకుతుండగా, మన దేశంలో 40 ఏళ్లు నిండిన వారికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చాలా అరుదుగా 30 ఏళ్ల వయస్సులోనూ, పురుషుల్లో కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకుతోంది. ప్రభుత్వం సైతం క్యాన్సర్‌ వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. రాష్ట్రంలో కాంప్రిహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసి, అత్యుత్తమ చికిత్సలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అక్టోబర్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన మాసం సందర్భంగా వివిధ సంస్థలు ప్రజల్లో దీనిపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాయి.

‘ఫ్యామిలీ డాక్టర్‌’తో మేలు..
గ్రామీణ ప్రాంత మహిళలకు కుటుంబ డాక్టర్‌ కార్యక్రమం వరంలా మారింది. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామానికే వైద్యులు వెళ్లడం, ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్టు వైద్యులు సైతం వెళ్లడంతో గ్రామీణ మహిళలు ఆరోగ్య చెకప్‌ చేయించుకుంటున్నారు. అక్కడ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే మమోగ్రామ్‌ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఇప్పటికే అనేక మందికి ప్రాథమిక దశలో గుర్తించారు. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కూడా వారిని ఫాలోఅప్‌ చేస్తూ మందులు అందజేస్తున్నారు.

సెల్ఫ్‌ చెక్‌ ఇలా..
పీరియడ్‌ వచ్చి, ఆగిన ఐదు రోజుల తర్వాత రొమ్ము సెల్ఫ్‌ చెక్‌ చేసుకోవాలి.

రొమ్ముపై గింజంత సైజులో కణితులు ఏమైనా వచ్చాయా, రొమ్ముపై చర్మం రంగు మారిందేమో చూడాలి.

చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను మహిళలు చెక్‌ చేసుకోవాలి.

రొమ్ముపై ఏమైనా కాయలు ఉన్నాయా, రొమ్ము టైట్‌ అవుతుందా, అల్సర్స్‌ వచ్చాయా, చనుమొనల నుంచి రక్తకారుతుందా వంటి అంశాలను సెల్ఫ్‌చెక్‌ చేసుకోవచ్చు.

నొప్పిలేని కణితులను క్యాన్సర్‌గా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి.

వీరికి రొమ్ము క్యాన్సర్‌ రావచ్చు..
లేటు వయస్సులో పిల్లలు పుట్టిన వారికి, బిడ్డకు పాలివ్వని తల్లులకు, వంశపారంపర్యంగా, జీవనశైలి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, రెడ్‌మీట్‌ తినేవారిలో, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రావచ్చు. ఊబకాయంతో ఉన్న మహిళలు, మోనోపాజ్‌ చేరే సమయంలో వచ్చే దుష్ఫలితాలకు వాడే మందులు కారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రావొచ్చు. పెళ్లిచేసుకోని మహిళలకు, పిల్లలు లేని మహిళలకు, ధూమపానం, ఆల్కాహాల్‌ తాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ.

లక్షణాలపై అవగాహన ఉండాలి..
రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలపై ప్రతి మహిళా అవగాహన పెంచుకోవడం ద్వారా తొలిదశలో గుర్తించవచ్చు. మన దేశంలో 40 ఏళ్లు దాటిన వారిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకుతొంది. మహిళలకు సోకే క్యాన్సర్‌లలో 70 శాతం మందిలో బ్రెస్ట్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌లు ఉంటున్నాయి. ప్రతి మహిళ సెల్ఫ్‌ చెక్‌ చేసుకోవాలి. రొమ్ముపై నొప్పిలేని కణితి వచ్చినా, చంకలో గడ్డలు ఏర్పడినా వైద్యుడిని సంప్రదించాలి. రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు.

– డాక్టర్‌ ఎన్‌. సుబ్బారావు, క్యాన్సర్‌ వైద్య నిపుణుడు

ప్రత్యేక దృష్టి..
ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో నాన్‌ కమ్యూనికల్‌ డిసీజెస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. అందులో భాగంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, ఓరల్‌ క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ వంటి లక్షణాలతో వచ్చిన వారిని గుర్తించి స్క్రీనింగ్‌ కోసం పంపుతున్నాం. అంతేకాకుండా ఆయా వ్యాధులతో చికిత్స పొందుతున్న వారిని సైతం మానిటరింగ్‌ చేసి మందులు అందిస్తున్నాం. రొమ్ముపై కణితులు, రొమ్ములో గడ్డలు ఉన్నట్లు మహిళలు వస్తే వారి లక్షణాలను పరిశీలించి నిర్ధారణ పరీక్షల కోసం పంపుతున్నారు. అన్ని పరీక్షలు ప్రభుత్వాస్పత్రిల్లో ఉచితంగా నిర్వహిస్తున్నాం.

– డాక్టర్‌ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌ఓ, ఎన్టీఆర్‌జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement