స్ట్రోక్ అంటే చాలా మంది హార్ట్ ఎటాక్ అనుకుంటారు. అలాగే మెదడుకు వచ్చే పోటును బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. దీనిపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కాళ్లు, చేతులు పడిపోతేనో, మూతి వంకర పోయిన తర్వాత మాత్రమే వైద్యుల వద్దకు వెళుతున్నారు. అయితే లక్షణాలను ముందుగా గుర్తించి వెంటనే వైద్యుల వద్దకు వెళితే జరగాల్సిన నష్టాన్ని సాధ్యమైనంతగా నివారించవచ్చు. నేడు వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
నెల్లూరు సిటీ: మారుతున్న జీవన విధానం, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా తరువాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. వ్యాధుల లక్షణాలను బట్టి ముందుగా వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం. దీనినే గోల్డెన్ పీరియడ్ అంటారు. తద్వారా జరగబోయే నష్టాన్ని వీలైనంతగా నివారించే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించి కూడా ముందుగా కనిపించే లక్షణాలను బట్టి డాక్టర్లను సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది.
బ్రెయిన్ స్ట్రోక్ అంటే..
సాధారణంగా శరీరంలో అన్ని భాగాల్లో రక్త సరఫరా సంపూర్ణంగా జరగాలి. అలా జరిగితేనే ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఏ భాగానికై నా రక్త సరఫరా సక్రమంగా జరగకపోతే ఆ భాగం అచేతనంగా మారుతుంది. ఏ సందర్భంలోనైనా మెదడుకు ఆ స్థితి ఎదురైతే మరణం సంభవిస్తుంది. దీనినే వైద్య పరిభాషలో బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు. రక్త ప్రసరణలో అసమతుల్యతకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి కొవ్వు చేరడం వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, రెండోది రక్తనాళాలు బలహీనపడి చిట్లడం. స్ట్రోక్ శరీరంలో ఏ భాగానికై నా రావచ్చు. సదరు శరీర భాగానికి రక్తం అందకపోవడం, గడ్డ కట్టడం వల్ల పక్షవాతం వస్తుంది. ఈ స్థితి నుంచి కోలుకోవడం అంత సులభమైన విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. మెదడు, గుండెకు వచ్చే స్ట్రోక్‌లు ప్రాణాంతకాలని పేర్కొంటున్నారు.
కరోనా తర్వాత పెరిగిన కేసులు
కోవిడ్–19 ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. కరోనా తరువాత మనిషిలో కొత్తగా అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైన సమస్య థ్రాంబోసిస్ ఒకటి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం చాలామందిలో వారికి తెలియకుండానే జరుగుతోంది. తద్వారా స్ట్రోక్‌కు గురయ్యే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది.
వయస్సుతో నిమిత్తం లేకుండా..
గతంలో ఓ నిర్ధిష్ట వయస్సు తర్వాతే స్ట్రోక్ వచ్చేది. అప్పట్లో 40 ఏళ్ల నంచి 60 ఏళ్ల వయస్సు లోపు వారిలోనే ఈ సమస్య కనిపించేది. ఇటీవల కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికై నా ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల చిన్న వయస్సు వారిలోనూ ఈ సమస్యను గుర్తిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమైన వారికి, భారీ శరీరం కలవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి, వంశ పారంపర్యంగా పక్షవాతం వచ్చే వారికి, మద్యపానం.. ధూమపానం చేసే వారికి, రక్తం చిక్కబడడం, రక్తనాళాలు పటుత్వం కోల్పోవడం ద్వారా స్ట్రోక్ ముప్పు ఉంటుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
ఇలా చేస్తే మేలు
► అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి.
► మద్యం, పొగ తాగడం పూర్తిగా వదిలివేయాలి.
► ఒత్తిడికి గురికాకూడదు.
► రోజూ కనీసం అర్ధగంటపాటు నడక కానీ, వ్యాయామం కానీ చేయాలి.
► ఉప్పు తినడం తగ్గించాలి. శరీర బరువు అదుపులో ఉంచుకోవాలి.
► గుండె కొట్టుకోవడంలో మార్పులు గమనించాలి.
► డయాబెటిస్ ఉన్న వారు గ్లూకోజ్ స్థాయిని నియంత్రించుకోవాలి.
► ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు, చేపలు, తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవాలి.
► బీపీ, షుగర్, గుండె సంబంధిత మందులు వాడుతున్న వారు ఆపకూడదు.
► తిన్న వెంటనే పడుకోవడం శ్రేయస్కరం కాదు.
ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచుకోవాలి
ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా 90 శాతం బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించవచ్చు. రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి స్ట్రోక్ నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. బీపీ, షుగర్‌లను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. గుండె జబ్బుకు సంబంధించిన మందులను ఆపకూడదు.
– డాక్టర్ ఎ.హేమలతారెడ్డి, న్యూరాలజిస్ట్, ఎండీ, డీఎం
గోల్డెన్ పీరియడ్ ఎంతో కీలకం
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే నాలుగున్నర గంటల్లోపు సమీప న్యూరోఫిజీషియన్ ఉన్న ఆస్పత్రికి వెళితే వెంటనే వారు థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఇది వెంటనే రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని పలుచబడేలా చేసి రక్త ప్రసరణలో ఇబ్బందులు లేకుండా చేస్తుంది. నాలుగున్నర గంటలు దాటితే ప్రతి నిమిషానికి బ్రెయిన్‌లో న్యూరాన్స్ తగ్గిపోతాయి. ఈ గోల్డెన్ పీరియడ్ ఎంతో కీలకం.
– డాక్టర్ ఎ.యామిని, న్యూరాలజిస్ట్, ఎండీ, డీఎం
Comments
Please login to add a commentAdd a comment