
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కృష్ణలంక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం బ్యారేజీ సమీపంలో సీతమ్మ వారి పాదాలు ఎదురుగా కృష్ణానదిలో ఓ మృతదేహం తేలుతున్నట్లు మంగళవారం ఉదయం 10 గంటలకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నది నుంచి బయటకు తీసి పురుషుడిగా గుర్తించారు. అతని వద్ద ఊరు, పేరుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు 5.8 అడుగుల ఎత్తు ఉండి నల్లని జుట్టు, బ్లూ షర్టు, బ్లాక్ కలర్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని, అతని వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో గానీ, 9849808555 నంబర్‌లో గానీ సంప్రదించాలని సూచించారు.
రైల్వే ట్రాక్‌పై..
జగ్గయ్యపేట అర్బన్: ముక్త్యాల రోడ్డులో స్టీల్ ప్లాంట్ సమీపంలో పాలేటిపై నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై పట్టాల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. అతని వయసు సుమారు 25 ఏళ్లు ఉంటాయి. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. నలుపు రంగుపై తెలుపు గీతలు ఉన్న టీ షర్ట్, తెలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్న వ్యక్తి గురించి ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం స్థానికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ డివిజన్‌కు చెందిన జీఆర్పీ ఎస్‌ఐ భూక్యా వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని తలకు గాయాలు ఉండటంతో గూడ్స్ రైలు ఢీ కొనడంతో మృతిచెంది ఉంటాయని భావిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.