
నిడమానూరులో వివాహిత హత్య
● వివాహేతర సంబంధమే కారణం ● గొంతుకు చున్నీ బిగించి హత్య చేసిన ప్రియుడు ● అదుపులోకి తీసుకున్న పటమట పోలీసులు
రామవరప్పాడు: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో జరిగిన ఘటనతో ముగ్గురు చిన్నారులకు అమ్మ ప్రేమ దూరమైంది. విజయవాడరూరల్ మండలం నిడమానూరులో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమానూరు నెహ్రూనగర్‌లో నివసించే పెదాల కావ్య, పెదాల ప్రకాష్‌రావు భార్యాభర్తలు. వీరికి వివాహమై తొమ్మిదేళ్లైంది. ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. ప్రకాష్ వంట మేస్త్రి. కావ్య గతంలో నగరంలోని ఓ హాస్పిటల్‌లో ఆయాగా పని చేసింది. ఆ సమయంలో నిడమానూరుకు చెందిన ఓ సంఘ నాయకుడు లాం వాసుతో పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కావ్యకు వివాహమైనా వీరి సంబంధం కొనసాగింది. మూడు నెలల క్రితం కావ్య పిల్లలతో కలిసి వాసుతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇది తెలిసిన కావ్య కుటుంబ సభ్యులు వీరిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించారు. అప్పటి నుంచి వాసును కావ్య దూరం పెట్టింది. దీంతో ఆమెను అతను తరచూ వేధించేవాడు. కావ్య భర్త ప్రకాష్ కుమార్ ఇంటిలో లేడనే విషయాన్ని తెలుసుకున్న వాసు శనివారం అర్ధరాత్రి కావ్య ఇంటికి వచ్చాడు. గతంలో మాదిరిగా తనతో ఉండాలని, మాట్లాడాలని బలవంతపెట్టాడు. దీనికి కావ్య నిరాకరించడంతో వీరి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో కావ్య మెడకు చున్నీ బిగించి వాసు హత్య చేశాడు. ఘటనను చూసిన పిల్లలు కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ అలికిడికి బయట పడుకున్న ఆమె తాత .. కావ్య చలనం లేకుండా పడి ఉండటం చూసి బంధువులకు విషయం తెలియజేశాడు. సమాచారం అందుకున్న పటమట సీఐ పవన్ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన లాం వాసును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment